Hostel: హాస్టళ్లు, పీజీ వసతిపై 12 శాతం జీఎస్టీ

  • రోజుకు రూ.వెయ్యి వసూలు చేసే హాస్టళ్లకు పన్ను విధింపు
  • వాటిని నివాస గృహాలుగా పరిగణించలేమన్న ఏఏఆర్ బెంగళూరు
  • రూ.వెయ్యి కన్నా తక్కువ చార్జ్ చేసినా జీఎస్టీ చెల్లించాల్సిందే.. లఖ్ నవూ బెంచ్ తీర్పు
Hostel Accommodation to attract 12 percent tax says Karnataka AAR

హాస్టల్ వసతిపై 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) బెంగళూరు బెంచ్ తాజాగా తీర్పు వెలువరించింది. హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్, క్యాంప్ సైట్లను నివాస గృహాలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. వాటి నిర్వాహకులు నెల నెలా వసూలు చేసుకునే మొత్తంపై జీఎస్టీ తప్పకుండా చెల్లించాలని తెలిపింది. దీంతో హాస్టళ్లలో ఉండే వారిపై మరింత భారం పెరగనుంది. రోజుకు రూ.వెయ్యి అంతకంటే ఎక్కువ వసూలు చేసే హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ సముదాయాలు, క్లబ్బులు, హాస్టళ్లు నివాస గృహాల కేటగిరీలోకి రావని ఏఏఆర్ బెంగళూరు బెంచ్ తెలిపింది. అందువల్ల వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈమేరకు శ్రీసాయి లగ్జరీయస్‌ స్టే ఎల్‌ఎల్‌పీ కేసులో తీర్పు వెలువరించింది. 

రోజుకు రూ. వెయ్యి వరకు ఛార్జ్ చేసే హోటళ్లు, క్లబ్బులు, క్యాంప్‌ సైట్లకు 2022 జులై 17 వరకే జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని ఏఏఆర్ పేర్కొంది. శాశ్వత నివాస సముదాయాలనే రెసిడెన్షియల్ యూనిట్లుగా పరిగణిస్తారని వివరించింది. హాస్టళ్లలో ఉండే వారికి వంట, వసతి వంటివి విడివిడిగా ఉండవని, ఉమ్మడిగా సదుపాయాలు కల్పిస్తూ నెల నెలా ఛార్జ్ చేస్తారని గుర్తుచేసింది. దీంతో వాటిని నివాస గృహాలుగా గుర్తించలేమని ఏఏఆర్ వివరించింది.

నోయిడాకు చెందిన వీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ హాస్టల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కేసులోనూ ఏఏఆర్ లఖ్ నవూ బెంచ్ ఇదే తరహా తీర్పును వెలువరించింది. అయితే, హాస్టల్ వసతికి ఛార్జ్ చేసే మొత్తం రూ. వెయ్యి కంటే తక్కువ ఉన్నప్పటికీ జీఎస్టీ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా, హాస్టళ్లపై 12 శాతం జీఎస్టీ విధించడం వల్ల విద్యార్థులపై అదనపు భారం పడుతుందని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ సీనియర్‌ పార్ట్‌నర్‌ రజత్‌ మోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌ పునరాలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

More Telugu News