stuart broad: ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ షాకింగ్ నిర్ణయం

stuart broad announce retirement to international cricket
  • అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టువర్ట్ బ్రాడ్
  • యాషెస్ తర్వాత వైదొలగనున్నట్లు ప్రకటన
  • టెస్టుల్లో 600కు పైగా వికెట్లు తీసిన బ్రాడ్
  • టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఐదో స్థానం
  • 2007 టీ20 వరల్డ్‌ కప్‌లో బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన యువీ
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ కొనసాగుతున్న సమయంలోనే.. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌‌మెంట్ ప్రకటించాడు. యాషెస్‌ సిరీస్‌లో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌ తనకు చివరిది అని వెల్లడిచాడు. యాషెస్ తర్వాత వైదొలుగుతానని 37 ఏళ్ల బ్రాడ్ చెప్పాడు.

2006 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన స్టువర్ట్ బ్రాడ్.. తన  కెరియర్‌‌లో 167 టెస్టుల్లో 602 వికెట్లు తీశాడు. వన్డేల్లో 121 మ్యాచ్‌లలో 178 వికెట్లు, టీ20ల్లో 56 మ్యాచ్‌లలో 65 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.

టెస్టులు మాత్రమే ఆడుతున్న బ్రాడ్.. ఏడేళ్లుగా వన్డే క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. చివరి వన్డే 2016 ఫిబ్రవరిలో, చివరి టీ20 2014 మార్చిలో ఆడాడు. బ్యాట్స్‌మన్‌ గానూ బ్రాడ్ మంచి స్కోర్లు నమోదు చేశాడు. టెస్టుల్లో 3,656 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

నిజానికి కెరియర్ ఆరంభంలోనే బ్రాడ్‌కు పీడ కల మిగిల్చాడు ఒకప్పటి స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి యువీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌ బ్రాడ్‌ పై మానసికంగా చాలా ప్రభావం చూపింది.

కానీ అతడు ఆ ఒక్క మ్యాచ్‌తో ఆగిపోలేదు. తర్వాత గోడకు కొట్టిన బంతిలా పైకి ఎదిగాడు. ఇప్పటితరం మేటి బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున జేమ్స్ అండర్సన్ తర్వాత 600 వికెట్లు సాధించిన బౌలర్‌‌గా రికార్డులకెక్కాడు.
stuart broad
international cricket
retirement
England
Ashes Test series

More Telugu News