Nara Lokesh: తన బండారం బయటపడుతుందనే జగన్ ఎక్కడికీ వెళ్లడు: నారా లోకేశ్

Lokesh take a swipe at CM Jagan in meeting with working professionals
  • అద్దంకి నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ యువగళం
  • తిమ్మనపాలెం వద్ద అపూర్వ స్వాగతం
  • సంతనూతలపాడు నియోజకవర్గం గుండ్లాపల్లిలో ప్రొఫెషనల్స్ తో భేటీ
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 169వ రోజు అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో తిమ్మనపాలెం వద్ద యువనేతకు అపూర్వ స్వాగతం లభించింది. భారీగజమాలలతో యువనేతను సత్కరించారు. బాణాసంచా మోతలు, కార్యకర్తల కేరింతలతో ఆ ప్రాంతం మారుమోగింది. పాదయాత్ర మేదరమెట్ల చేరుకోగానే మాస్ జాతరతో యువగళం జనప్రవాహంగా మారిపోయింది.

అంతకుముందు, సంతనూతలపాడు నియోజకవర్గం గుండ్లాపల్లిలో లోకేశ్ వర్కింగ్ ఫ్రొఫెషనల్స్ తో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ....

ప్రభుత్వాలు మారినపుడల్లా పాలసీలు మారకూడదు

జగన్ నాలుగేళ్లుగా ఎకనమిక్ యాక్టివిటీని పూర్తిగా ఆపేశాడు, రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు మారకూడదు. రాష్ట్రం అభివృద్ది బాట పట్టాలంటే చంద్రబాబు వల్లే అవుతుంది. అప్పు చేసి సంక్షేమం చెయ్యడం గొప్ప కాదు... సంపద సృష్టించి సంక్షేమం అందించే సామర్థ్యం ఒక్క చంద్రబాబుకే ఉంది. 

వర్కింగ్ ఫ్రొఫెషనల్స్ అంతా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పాలసీలు రూపొందించడానికి ప్రొఫెషనల్స్ ని భాగస్వామ్యం చేస్తాం. వివిధ రంగాల నిపుణులను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకే ప్రొఫెషనల్ వింగ్ ఏర్పాటు చేశాం. 

ఆ రోజున ప్రజలంతా చంద్రబాబును నమ్మారు!

రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు. కట్టుబట్టలతో మెడ పట్టి బయటకి గెంటేశారు. ఆ రోజు ప్రజలంతా చంద్రబాబు అయితేనే రాష్ట్రాన్ని బాగు చేయగలరని నమ్మారు. అందరినీ ఒప్పించి అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించారు. రాయలసీమని ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ హబ్ గా తయారు చేశాం. 

విశాఖను ఐటీ హబ్ గా తయారు చేశాం. టీడీపీ హయాంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే శాసనసభ సాక్షిగా ప్రకటించింది. ఐటీ మంత్రిని చూస్తుంటే కోడి గుడ్డు గుర్తుకు వచ్చే పరిస్థితి జగన్ పాలనలో వచ్చింది. జగన్ కు ఐఈడీ డిజార్డర్ అనే జబ్బు ఉంది. ఈ జబ్బు లక్షణం విధ్వంసం. 

కంపెనీలు రావాలంటే నమ్మకం కలిగించాలి

జగన్ తరిమేసిన కంపెనీలను తిరిగి తీసుకురావడం కష్టం. ఏపీలో ఉన్న కంపెనీలకు ముందు నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంది. ముందు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉంటేనే బయట వాళ్లు వస్తారు. లూలూ సంస్థ ఏపీలో తప్ప దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించింది.

చంద్రబాబు పాలనలో కియా, ఫాక్స్ కాన్ వచ్చాయి. జగన్ పాలనలో ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ లిక్కర్ కంపెనీలు వచ్చాయి.

అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం!

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా పరిశ్రమలు తీసుకొస్తాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుతాం. ఏపీ బ్రాండ్ వాల్యూ పెంచే విధంగా కొత్త పాలసీలు ప్రకటిస్తాం. పరిశ్రమల స్థాపన ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఏపీని ప్రమోట్ చెయ్యడానికి జగన్ కి ఇష్టం లేదు. 

గూగుల్ లో జగన్ పేరు కొడితే ఖైదీ నంబర్ 6093 అని వస్తుంది. తన బండారం బయటపడుతుందనే ఎక్కడకీ వెళ్లడు. జైలు భయంతోనే నూతన కోర్టుల నిర్మాణానికి జగన్ నిధులు కేటాయించలేదు. న్యాయవాదులకి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చర్యలు తీసుకుంటాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన న్యాయవాదులకు ప్రొఫెషనల్ ట్యాక్స్ ని రద్దు చేస్తాం.

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాడు!

జగన్ విద్యా వ్యవస్థను నాశనం చేశాడు. నాడు-నేడు అని హడావిడి చెయ్యడం తప్ప విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోలేదు. సర్వశిక్షా అభియాన్ లో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్ కి న్యాయం చేస్తాం. గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తాం. 

జగన్ ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు వేయకపోవడం వలన కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేట్లు అందక ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తాం. వన్ టైం సెటిల్ మెంట్ చేసి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇప్పిస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్యను తిరిగి ప్రారంభిస్తాం.

ఫైబర్ గ్రిడ్ తో మెరుగైన ఇంటర్నెట్

ఎన్నో కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ తో ముందుకు వెళుతున్నాయి. అది ముందుగానే ఆలోచించి ఫైబర్ గ్రిడ్ పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫైబర్ గ్రిడ్ ద్వారా మెరుగైన ఇంటర్నెట్ సర్వీస్ అందిస్తాం. ఫైబర్ గ్రిడ్ పై అనేక ఆరోపణలు చేసి ఒక్క ఆధారం కూడా జగన్ చూపించలేకపోయారు. 

కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అవహేళన చేసిన వాళ్లు ఇప్పుడు ఐటీ అభివృద్ది గురించి మాట్లాడుతున్నారు. ముడిసరుకు దగ్గర నుండి పూర్తి స్థాయిలో ఉత్పత్తులు తయారీ మొత్తం ఏపీలో జరగాలనేది టీడీపీ లక్ష్యం. ఉద్యోగాల కల్పనే ప్రామాణికంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పిస్తాం. ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే ఎక్కువ రాయితీలు ఇవ్వాలన్నది మా పాలసీ.

ప్రైవేట్ టీచర్లను ఆదుకుంటాం!

ప్రైవేట్ స్కూల్స్ యజమానులను జగన్ ప్రభుత్వం వేధిస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేట్ టీచర్లను కూడా ఆదుకుంటాం. జగన్ పాలనలో ఒకే ఏడాదిలో 8 లక్షల గ్యాస్ కనెక్షన్లు పక్క రాష్ట్రానికి మారిపోయాయి. అంటే నిరుద్యోగం ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

మెగా డీఎస్సీ దేవుడెరుగు... జాతీయ విద్యా విధానం పేరుతో జగన్ స్కూళ్లు మూసేస్తున్నాడు. టీచర్ పోస్టులు తగ్గిస్తున్నాడు. టీడీపీ వచ్చాక కేజీ టూ పీజీ విద్యను ప్రక్షాళన చేస్తాం. జాబ్ రెడీ యూత్ ని సిద్దం చేస్తాం.

హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరుపెడతాం!

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతాం. చంద్రబాబు సీఎంగా ఉండగా కడప జిల్లాకి వైఎస్ పేరు తొలగించలేదు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్ వారియర్స్ ని జగన్ ప్రభుత్వం మోసం చేసింది. వారిని ఆదుకునే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2232.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 16 కి.మీ.*

*170వరోజు (30-7-2023) యువగళం వివరాలు*

*అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడిప్రకాశం జిల్లా)*

సాయంత్రం

4.00 – అద్దంకి మధురానగర్ క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.30 – రామ్ నగర్ లో స్థానికులతో మాటామంతీ.

4.45 – అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ.

5.00 – అద్దంకి పాతబస్టాండు వద్ద బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

5.30 – భవానీ సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.

6.15 – గుండ్లకమ్మ బ్రిడ్జి వద్ద స్థానికులతో సమావేశం.

6.35 – తిమ్మాయపాలెంలో స్థానికులతో సమావేశం.

8.35 – పాదయాత్ర దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

9.20 – శంకరాపురంలో స్థానికులతో సమావేశం.

10.20 – పోలవరంలో స్థానికులతో సమావేశం.

11.35 – వేంపాడు శివారు విడిది కేంద్రంలో బస.

******

Nara Lokesh
Working Professionals
Gundlapalli
Santhanuthalapadu
Addanki
Yuva Galam Padayatra
TDP
Prakasam District
Andhra Pradesh

More Telugu News