BJP: బీజేపీ జాతీయ కార్యవర్గంలో సత్యకుమార్ కొనసాగింపు... సునీల్ దేవధర్ కు దక్కని చోటు

Y Sathyakumar continued in BJP National Body
  • బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన జేపీ నడ్డా
  • 13 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులతో నూతన కార్యవర్గం
  • నూతన కార్యవర్గంలో 13 మంది కార్యదర్శులు
  • వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గంలో మార్పులు

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. నడ్డా 13 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది కార్యదర్శులతో తాజా జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. 

పలువురు సీనియర్ నేతలు జాతీయ కార్యవర్గంలో చోటు నిలుపుకోలేకపోయారు. కేంద్ర మాజీ మంత్రి రాధామోహన్ సింగ్, పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన సీటీ రవి, లోక్ సభ సభ్యుడు దిలీప్ సైకియా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులను కోల్పోయారు. లోక్ సభ సభ్యుడు వినోద్ సోంకార్, సునీల్ దేవధర్ జాతీయ కార్యదర్శి పదవులను కోల్పోయారు. 

ఏపీకి చెందిన బీజేపీ నేత వై.సత్యకుమార్ జాతీయ కార్యవర్గంలో మరోసారి చోటు దక్కించుకున్నారు. ఇప్పటివరకు బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ ఇకపైనా అదే పదవిలో కొనసాగనున్నారు.

బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్చార్జిగా ఉన్న సునీల్ దేవధర్ కు తాజా బీజేపీ జాతీయ కార్యవర్గంలో స్థానం లభించని నేపథ్యంలో, ఆయన ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి పదవిని కోల్పోనున్నారు. 

అటు, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న తరుణ్ చుగ్ పార్టీ నమ్మకాన్ని నిలుపుకున్నారు. ఆయనను కొత్త జాతీయ కార్యవర్గంలో కొనసాగిస్తూ జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. తరుణ్ చుగ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఇక మీదటా అదే పదవిలో కొనసాగనున్నారు.

  • Loading...

More Telugu News