YS Sharmila: పిట్టలదొర పాలన ఇలాగే ఉంటుంది సీఎం కేసీఆర్ పై షర్మిల విమర్శలు

  • వర్షాలు తగ్గాక చుట్టం చూపుగా హెలికాప్టర్లో చక్కర్లు కొడతారని విమర్శ
  • డల్లాస్, ఇస్తాంబుల్, లండన్ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పారని ఆగ్రహం
  • ఇప్పుడు వరదల్లో జనాన్ని నిండా ముంచారని షర్మిల వ్యాఖ్యలు
Sharmila fires at KCR government over rains and floods

భారీ వర్షాలకు ఊళ్లు మునిగినా, ఇళ్లు కూలినా, జనం వరదల్లో పడి కొట్టుకుపోయినా దొర గడీ దాటి బయటకు రాడని, జనాన్ని ఆదుకోడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఆమె తన సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వర్షాలు తగ్గిన తర్వాత చుట్టం చూపుగా హెలికాప్టర్లో చక్కర్లు కొడతారని, ఆదుకుంటామని గప్పాలు కొడతారని, ఇంటికి పదివేలు, పంటకు పదివేలు అనే ప్రకటనలు ఇచ్చి, తిరిగి ఫామ్ హౌస్ వచ్చి మొద్దనిద్ర పోతాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తొమ్మిదేళ్లుగా భారీ వర్షాలకు, అకాల వర్షాలకు వేల కోట్ల పరిహారం అని చెప్పుడే కానీ రూపాయి ఇచ్చింది లేదన్నారు. కనీసం వరదల్లో కొట్టుకుపోయిన వారి కుటుంబాలను ఆదుకున్నదీ లేదన్నారు. ఓట్ల కోసం డల్లాస్, ఇస్తాంబుల్, లండన్ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పడం... వరదల్లో జనాన్ని నిండా ముంచడం.. ఇదే పిట్టల దొర పాలన అని ఎద్దేవా చేశారు. 

వరదల్లో వరంగల్ మునగకుండా మాస్టర్ ప్లాన్ అని మూడేళ్ళ కిందట ప్రకటించినా ఫైల్ కదలలేదన్నారు. రూ.250 కోట్లు తక్షణం ఇవ్వమని అడిగితే పైసా ఇవ్వలేదన్నారు. రూ.1000 కోట్లతో భద్రాచలం కరకట్ట అంటూ హామీని ఇచ్చి, గోదాట్లో కలిపేశాడన్నారు. ఏడాదిగా గేట్లు మొరాయించినా కడెం ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు.

పర్యటనకు వెళ్లిన మంత్రులు దేవుడే దిక్కని చెబుతున్న మాటలు వారి విజనరీ పాలనకు నిదర్శనమని షర్మిల ఎద్దేవా చేశారు. ప్రశ్నించే ప్రతిపక్షాలది చిల్లర రాజకీయం అంటారని, మరి జనాలను వరదల్లో పెట్టి, బురదలోకి నెట్టిన అధికార పార్టీ చేసేదాన్ని ఏమనాలి దొరా? అని ప్రశ్నించారు. 

కనీసం ఎన్నికల ముందు అయినా, వర్షాలతో సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవాలని, చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, కూలిపోయిన ఇళ్ల స్థానంలో పక్కా ఇళ్లు కట్టించాలని తాము డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.

More Telugu News