Nirmala Sitharaman: దేశీయ కంపెనీలకు నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్

  • భారత కంపెనీలు ఇక విదేశీ ఎక్చేంజిలు, అహ్మదాబాద్ ఐఎఫ్ఎస్‌సీలో నేరుగా లిస్టింగ్
  • త్వరలో అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడి
  • 2020లో ప్యాకేజీకి ఆమోదం తెలిపినప్పటికీ... నోటిఫై కాని నిబంధనలు
Sitharaman says Indian companies can go for overseas listing

భారతీయ కంపెనీలు ఇక విదేశీ ఎక్చేంజిలు , అహ్మదాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్‌సీ)లో నేరుగా లిస్టింగ్‌కు వెళ్లవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. త్వరలో ఈ వెసులుబాటు అందుబాటులోకి రానుంది.

దేశీయ కంపెనీలకు ఇది కచ్చితంగా శుభవార్తే. అంతర్జాతీయ మార్కెట్లలోని వివిధ ఎక్చేంజిల్లో భారత కంపెనీలు నేరుగా లిస్ట్ అయితే ఆయా కంపెనీలకు విదేశీ నిధులు పొందడానికి వీలు కలుగుతుంది.

2020 మేలో కరోనా సమయంలో కేంద్రం ఆమోదించిన ప్రత్యేక ప్యాకేజీలో ఇది కూడా ఉంది. అయితే నిబంధనలను నోటిఫై చేయలేదు. త్వరలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరికొన్ని వారాల్లో దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు కానున్నాయి. 

ముంబైలో జరిగిన కార్పోరేట్ డెట్ మార్కెట్ డెవలప్‌మెంట్ ఫండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మల మాట్లాడారు. విదేశాల్లో దేశీయ కంపెనీల సెక్యూరిటీలను నేరుగా లిస్టింగ్ చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఐఎఫ్ఎస్‌సీలోనూ లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు నేరుగా లిస్ట్ అయ్యే అవకాశాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. దీంతో విదేశీ నిధులు సమకూర్చుకోవడంతో పాటు మంచి వాల్యుయేషన్ కు అవకాశముందన్నారు. 

దేశీయ కంపెనీలకు మొదట ఐఎఫ్ఎస్‌సీలో అనుమతిచ్చి, ఆ తర్వాత ఏడెనిమిది ఎంపిక చేసిన దేశాల్లోని స్టాక్ ఎక్చేంజిలకు అనుమతిస్తారని అధికారులు చెబుతున్నారు. తొలి దశలో అమెరికా, బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో లిస్టింగ్ కు అవకాశమివ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఓ కంపెనీ విదేశీ మార్కెట్లో అడుగు పెట్టాలంటే దేశీయంగా లిస్ట్ కావాలి. కేంద్రం నిర్ణయంతో ఇకపై నేరుగా విదేశీ స్టాక్ ఎక్చేంజిల్లో లిస్టింగ్ కు వీలుంటుంది.

More Telugu News