Blue Whale: శ్రీకాకుళం జిల్లాలో తీరానికి కొట్టుకొచ్చిన అరుదైన నీలి తిమింగలం

  • సంతబొమ్మాళి మండలం పాత మేఘవరం సముద్రతీరంలో మృత నీలి తిమింగలం
  • ఆసక్తిగా తిలకిస్తున్న స్థానికులు
  • 25 అడుగుల పొడవున్న బ్లూ వేల్
Rare Blue Whale washed ashore in Srikakulam district

భారత తూర్పు తీర ప్రాంతంలో తిమింగలాలు, డాల్ఫిన్ల సంఖ్యపై కేంద్రం గణాంకాలు ప్రకటించడం తెలిసిందే. అయితే పలు డాల్ఫిన్లు, తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చి మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 

తాజాగా, శ్రీకాకుళం జిల్లాలో ఓ అరుదైన బ్లూ వేల్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సంతబొమ్మాళి మండలం పాత మేఘవరం వద్ద ఇది తీరంలో పడి ఉండడంతో స్థానికులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. 

నీలి తిమింగలాలు బంగాళాఖాతంలో ఎంతో అరుదుగా కనిపిస్తుంటాయి. ఇవి గరిష్ఠంగా 98 అడుగుల పొడవు పెరుగుతాయి. దాదాపు 100 టన్నులకు పైగా బరువుంటాయి. ఒక పెద్ద నీలి తిమింగలం 33 ఏనుగుల బరువుకు సమానంగా ఉంటుందని అంచనా. నీటిలోనూ, భూమ్మీద ఇదే అతి పెద్ద జీవి. 

శ్రీకాకుళం జిల్లాలో ఒడ్డుకు కొట్టుకొచ్చిన నీలి తిమింగలం చాలా చిన్నదిగా తెలుస్తోంది. ఇది 25 అడుగుల పొడవు, 5 టన్నుల బరువుంటుందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.

More Telugu News