air asia: గవర్నర్‌ను వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయిన విమానం.. క్షమాపణ చెప్పిన ఎయిరేసియా

  • జులై 27న జరిగిన సంఘటన
  • ఆ తర్వాత మరో విమానంలో హైదరాబాద్ వెళ్లిన కర్ణాటక గవర్నర్
  • విమానాశ్రయంలో ఫిర్యాదు.. దర్యాఫ్తు చేస్తున్న విమానయాన సంస్థ
AirAsia takes off without Karnataka Governor Thawar Chand Gehlot on board

బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 నుండి కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను ఎక్కించుకోకుండానే ఎయిరేసియా విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ ఘటన జులై 27 మధ్యాహ్నం చోటు చేసుకుంది. గవర్నర్ టెర్మినల్‌కు చేరుకోవడంలో ఆలస్యమైందని ఎయిర్‌లైన్స్ చెబుతుండగా, గవర్నర్ విమానాశ్రయ లాంజ్‌లో వేచి ఉన్నారని అధికారులు చెబుతున్నారు. గవర్నర్ ను ఎక్కించుకోకుండా విమానయాన సంస్థ ప్రోటోకాల్ ను ఉల్లంఘించిందని అధికారులు అన్నారు.

గెహ్లాట్ హైదరాబాద్ వెళ్లడానికి ఆరోజు మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన లగేజీని కూడా ఎయిరేసియాలో ఎక్కించారు. వీఐపీ లాంజ్ నుండి ఆయన టెర్మినల్ 2కు చేరుకునేలోపు విమానం టేకాఫ్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గవర్నర్ టెర్మినల్ వద్ద బోర్డింగ్ గేట్ కు చేరుకోవడం ఆలస్యం కావడం వల్ల విమానం వెళ్లిపోయిందన్నారు.

గవర్నర్ ప్రోటోకాల్ అధికారి ఏం చెప్పారు?

గవర్నర్ ప్రోటోకాల్ టీమ్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. గవర్నర్ సమయానికి ముందే వీవీఐపీ లాంజ్‌కు చేరుకుని వేచి ఉన్నారు. గవర్నర్ మధ్యాహ్నం గం.1.30కు విమానాశ్రయానికి చేరుకున్నారని, టెర్మినల్ 1లోని వీవీఐపీ లాంజ్‌లో వేచి ఉన్నారని, ఆయన రాక గురించి ఎయిర్‌లైన్ గ్రౌండ్ సిబ్బందికి కూడా సమాచారం అందించామని, ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారి తెలిపారు.

విమానం, I5972, మధ్యాహ్నం 2:05 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. గవర్నర్ మధ్యాహ్నం 2:06 గంటలకు టెర్మినల్ 1 నుండి టెర్మినల్ 2కి చేరుకున్నారు. అయితే ఆలస్యమని పేర్కొంటూ ఎయిర్‌లైన్ సిబ్బంది ఆయన బోర్డింగ్‌ను అనుమతించడానికి నిరాకరించినట్లు అధికారి చెప్పారు. ప్రోటోకాల్ ఆఫీసర్ కథనం ప్రకారం... విమానం మధ్యాహ్నం గం.2.27కు బయలుదేరింది. గవర్నర్ ను అక్కడే వదిలేసి విమానం టేకాఫ్ అయింది. 90 నిమిషాల అనంతరం మరో విమానంలో గవర్నర్ హైదరాబాద్ చేరుకున్నారు. 

ఎయిర్‌లైన్ క్షమాపణ

ఎయిరేసియా సిబ్బంది నిర్వాకంపై గవర్నర్ ప్రోటోకాల్ అధికారులు విమానాశ్రయంలో ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారు ఒకరు మీడియాకు వెల్లడించారు. దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. గవర్నర్ కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఇందుకు క్షమాపణలు చెబుతున్నామని ఎయిరేసియా ప్రకటించింది. దర్యాఫ్తు చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. వృత్తిపరంగా అత్యున్నత ప్రమాణాలు, ప్రోటోకాల్ కు కట్టుబడి ఉండటానికే ప్రాధాన్యతనిస్తామని తెలిపింది. గవర్నర్ కార్యాలయంతో తమ సంబంధాలను ఎప్పుడూ గౌరవిస్తామని, ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.

More Telugu News