Vijayasai Reddy: సినిమా హీరోల పారితోషికంపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ
  • పెద్ద హీరోలు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నారని వెల్లడి
  • బడ్జెట్లో అధికభాగం హీరోల రెమ్యూనరేషన్ కే పోతోందని వివరణ
  • సినీ కార్మికులకు మాత్రం నామమాత్రంగా చెల్లిస్తున్నారని ఆరోపణ
Viajayasai Reddy comments on heroes remunerations

సినిమా అంటే హీరో ఒక్కడే కాదని, సినిమా బడ్జెట్లో అత్యధిక భాగం హీరోల పారితోషికాలకే వెళుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా సినిమా హీరోల పారితోషికాలపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

సల్మాన్ ఖాన్ తదితర పెద్ద హీరోలు ఒక సినిమాకు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోందని, ఓ సినిమా బడ్జెట్లో మూడో వంతు ఇలా హీరోలకు పారితోషికం ఇచ్చేందుకే సరిపోతోందని వెల్లడించారు. 

భారత చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల్లో కలిపి 2 లక్షల మంది కార్మికులు ఉంటారని, వారికి మాత్రం నామమాత్రపు జీతాలు ఇస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం తనవంతు చర్యలు తీసుకోవాలని కేంద్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు విజ్ఞప్తి చేశారు. 

సినిమా బడ్జెట్లో అధికభాగాన్ని రెమ్యూనరేషన్ రూపంలో హీరోలకు అందించే పరిస్థితులను మార్చాలని, ఆ మేరకు సినిమాటోగ్రఫీ చట్టాన్ని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. 


హీరోల కొడుకులే హీరోలా... దేశంలో ఇంకెవరూ అందగాళ్లు లేరా?

సినీ రంగంలో వారసత్వ పోకడలపైనా విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. అత్యధికంగా హీరోల కొడుకులే హీరోలు అవుతున్నారని విమర్శించారు.  

హీరోల కుమారుల కంటే అందగాళ్లు, టాలెంట్ ఉన్నవాళ్లు దేశంలో చాలామంది ఉన్నారని, కానీ అవకాశాలు దక్కని పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఇక, హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు కానీ, హీరోల కుమార్తెలు హీరోయిన్లు అవుతున్న దాఖలాలు చాలా తక్కువ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

More Telugu News