World Economy: దారుణంగా పతనమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ: ఐఎంఎఫ్

  • 2024 నాటికి 1 శాతానికి పడిపోనున్న అమెరికా రియల్ జీడీపీ
  • ఇదే సమయంలో 5 శాతానికి పెరగనున్న ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల వాస్తవ జీడీపీ
  • యూరోపియన్ ఏరియా జీడీపీపై ప్రభావం చూపుతున్న జర్మనీ
How the World Economy is Expected to Grow estimated by IMF

2024 చివరి నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి మందగిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2023, 24 సంవత్సరాల్లో గ్లోబల్ రియల్ జీడీపీ (వాస్తవ జీడీపీ) 3.5 శాతం పెరగవచ్చని 2022లో ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే తాజాగా తన అంచనాను ఐఎంఎఫ్ సరిచేసింది. ఈ పెరుగుదల కేవలం 3 శాతం వరకు మాత్రమే ఉంటుందని తాజాగా అంచనా వేసింది. 

దారుణంగా అమెరికా పరిస్థితి.. ఆసియా దేశాలు టాప్:
ఎకానమీ గ్రోత్ రేట్ లో ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు టాప్ లో ఉన్నాయి. ఇదే సమయంలో అగ్రదేశం అమెరికా పరిస్థితి దారుణంగా ఉంది. 2022లో అమెరికా రియల్ జీడీపీ 2.1 శాతంగా ఉండగా... 2024కి ఇది 1 శాతానికి పడిపోనుంది. అమెరికా ఎకానమీ గ్రోత్ రేట్ దారుణంగా పతనమవుతుండటం యావత్ ప్రపంచంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

మరోవైపు ఆసియాలోని అభివృద్ది చెందుతున్న దేశాలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి. ఇతర ప్రాంతాల కంటే వేగంగా ఆర్థిక పురోగతి దిశగా దూసుకెళ్తున్నాయని ఐఎంఎఫ్ తెలిపింది. 2022లో ఈ దేశాల రియల్ జీడీపీ 4.3 శాతంగా ఉండగా... 2024 నాటికి 5 శాతానికి చేరుకుంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 

ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటులో కూడా తగ్గుదలే:
ఇక యావత్ ప్రపంచ రియల్ జీడీపీ కూడా 2022తో పోలిస్తే తగ్గుముఖం పడుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2022లో 3.3 శాతంగా ఉన్న గ్లోబల్ రియల్ జీడీపీ 2023, 24 సంవత్సరాల్లో 3 శాతం మాత్రమే ఉంటుందని తెలిపింది. యూరోపియన్ ఏరియాలో కూడా రియల్ జీడీపీ దారుణంగా తగ్గినప్పటికీ.. 2023తో పోలిస్తే 2024లో కాస్త పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2022లో 3.5గా ఉన్న రియల్ జీడీపీ... 2023లో 0.9 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే 2024లో ఇది 1.5 శాతానికి చేరుకుంటుందని చెప్పింది. 

యూరోపియన్ ఏరియా గ్రోత్ రేట్ పై జర్మనీ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. జర్మనీ మాన్యుఫాక్చరింగ్ ఔట్ పుట్ పడిపోవడంతో ఆ దేశ జీడీపీ తగ్గింది. 2023లో ఆ దేశ జీడీపీ 0.3 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.


More Telugu News