Hyderabad: షికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న హైదరాబాద్ యువతి.. జైశంకర్‌కు తల్లి లేఖ

  • మాస్టర్స్ కోసం షికాగో వెళ్లిన మౌలాలివాసి సయ్యదా
  • రెండు నెలలుగా కూతురు నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో తల్లి ఆందోళన
  • షికాగోలో గుర్తించినట్లు సమాచారం ఇచ్చిన హైదరాబాదీయులు
  • తన కూతురును భారత్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి
Hyderabad woman starves on US street mother appeals to S Jaishankar for help

తన కూతురు అమెరికాలో ఆకలితో అలమటిస్తోందని, ఆమెను భారత్ తీసుకురావాలని హైదరాబాద్ లోని మౌలాలికి చెందిన సయ్యదా పహాజ్ ఫాతిమా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. అమెరికాలో మాస్టర్స్ చేయడానికి మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ 2021 ఆగస్ట్‌లో షికాగో వెళ్లారు. తల్లి ఫాతిమా తరుచూ కూతురుతో ఫోన్లో మాట్లాడుతుండే వారు. అయితే, గత రెండు నెలలుగా కూతురు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె ఆందోళన చెందారు.

 హైదరాబాద్ నుండి అమెరికా వెళ్లిన కొంతమంది... మిన్హాజ్ జైదీ ఆకలితో అలమటిస్తున్నట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆమె తల్లికి తెలియజేశారు. ఆమె వస్తువులు ఎవరో దొంగిలించారని, దీంతో షికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని తెలిపారు. ఆమె మానసిక ఒత్తిడికి కూడా లోనవుతున్నట్లు వెల్లడించారు.

విషయం తెలిసిన తల్లి ఫాతిమా తన కూతురును భారత్ తీసుకు రావాలని కేంద్రమంత్రికి లేఖ రాశారు. తన కూతురు సయ్యదా అమెరికాకు మాస్టర్స్ చేయడానికి వెళ్లిందని, రెండు నెలలుగా ఆమె తనకు ఫోన్ చేయడం లేదని, హైదరాబాద్ నుండి వెళ్లిన కొంతమంది షికాగోలో తన కూతురును గుర్తించారని, ఆమె వస్తువులు చోరీకి గురయ్యాయని, ఆకలితో అలమటిస్తోందని చెప్పారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురును వెంటనే భారత్ కు తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News