ajit doval: చైనాతో సంబంధాలపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు

  • ఇండియా-చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న అజిత్ దోవల్
  • ఇరు దేశాల మధ్య విశ్వాసం కనుమరుగైందని వ్యాఖ్య
  • ఇబ్బందికర పరిస్థితులను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సూచన
  • దక్షిణాఫ్రికాలో చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్‌ యీతో భేటీ
ajit dovals tough talk in meeting with china diplomat

పక్కలో బల్లెంలా ఉన్న పొరుగు దేశం చైనాతో భారతదేశం సంబంధాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2020లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చోటుచేసుకొన్న పరిణామాల కారణంగా భారత్‌-చైనా మధ్య వ్యూహాత్మక, ప్రజా, రాజకీయ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య విశ్వాసం కనుమరుగైందని అన్నారు.

దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ సమావేశానికి వచ్చిన అజిత్ దోవల్.. చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్‌ యీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య ఇబ్బందికర పరిస్థితులను తొలగించేందుకు నిరంతరం చర్యలు చేపట్టాలని అజిత్ దోవల్ సూచించారు. సరిహద్దు సమస్యపై చర్చించేందుకు ప్రత్యేక ప్రతినిధులుగా చైనా తరపున వాంగ్‌ యీ, భారత్‌ తరపున అజిత్‌ దోవల్ వ్యవహరిస్తున్నారు.

చైనా ప్రతినిధి వాంగ్‌యీ మాట్లాడుతూ.. ఇరు దేశాలు పరస్పరం వ్యూహాత్మక విశ్వాసాన్ని పెంచుకుని.. సహకారంపై దృష్టి పెట్టి అడ్డంకులను దాటాలని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పూర్వ స్థితికి తీసుకురావాలని ఆకాంక్షించారు. చైనా ఎప్పుడూ ఆధిపత్య ధోరణి ప్రదర్శించబోదని.. భారత్‌ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇక సైబర్‌ భద్రతపై సమష్టిగా కలిసి పనిచేయాలని మిత్రదేశాలకు బ్రిక్స్‌ సమావేశంలో అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

More Telugu News