Jeevan Reddy: I-N-D-I-A కూటమి అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్లు పెంచుతాం!: జీవన్ రెడ్డి

  • తెలంగాణ వస్తే బడుగులకు న్యాయం జరుగుతుందని భావించామన్న ఎమ్మెల్సీ
  • కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదని ఆగ్రహం
  • ఒక్క బీసీకి ఆర్థికంగా సాయం చేయని ప్రభుత్వం కేసీఆర్‌దే అని వ్యాఖ్య
Jeevan Reddy fires at CM KCR

ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం నిప్పులు చెరిగారు. సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ వస్తే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని భావించామని, కానీ అలా జరగడం లేదన్నారు. కేవలం కేసీఆర్ వల్ల రాష్ట్రం సిద్ధించలేదని, నిరుద్యోగులు, యువత, అన్ని వర్గాలు పోరాటం చేశాయని, వందలాది మంది ప్రాణత్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలను కేసీఆర్ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. I-N-D-I-A కూటమి అధికారంలోకి రాగానే బలహీనవర్గాలకు రిజర్వేషన్లను పెంచుతామన్నారు.

ప్రజల్ని మోసం చేయడంలో కేసీఆర్ ను మించిన నాయకుడు లేడని ధ్వజమెత్తారు. దళితులకు సీఎం పదవి, దళితులకు మూడెకరాల భూమి అంటూ మోసం చేశారన్నారు. ఇప్పుడు కొనేందుకు భూమి కూడా దొరకడం లేదన్నారు. దళిత బంధు కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల వరకే పరిమితమైందని విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో 1,500 మందికి దళిత బంధు ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.

దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపిందని, కానీ అమలు చేయడం లేదన్నారు. ఒక్క బీసీకి కూడా ఆర్థికంగా సాయం చేయని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. బీసీలోన కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే ఆర్థిక సాయమని ప్రభుత్వం చెప్పిందని, ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారో చెప్పాలన్నారు.

More Telugu News