Indian Origin Girl: రోజూ స్కూలుకు వెళుతూనే 50 దేశాలు చుట్టేసిన పదేళ్ల చిన్నారి

  • మూడేళ్ల వయసులో జర్మనీకి మొదటి టూర్
  • వారాంతాలు, బ్యాంకు సెలవులలో టూర్ ప్లానింగ్
  • ఎయిర్ పోర్ట్ నుంచే నేరుగా స్కూలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్న పేరెంట్స్
Indian Origin Girl 10 Has Visited 50 Countries Without Missing A School Day

పదేళ్లలోపే ప్రపంచంలోని యాభై దేశాలను చుట్టివచ్చిందో చిన్నారి.. అదికూడా ఒక్కరోజు కూడా స్కూలు మానకుండా.. తల్లిదండ్రులతో కలిసి విదేశాలలో పర్యటించడం ఎంతో ఇష్టమని చెబుతున్న ఆ చిన్నారి ఇటీవలే పదవ పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. లండన్ కు చెందిన ఆ చిన్నారి పేరు అదితి త్రిపాఠి.. తండ్రి దీపక్, తల్లి అవిలాశ త్రిపాఠి. భారత సంతతికి చెందిన దీపక్ ఉద్యోగరీత్యా లండన్ లో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు ఇద్దరూ అకౌంటెంట్లుగా పనిచేస్తూ సెలవు రోజుల్లో విదేశాలను చుట్టివస్తున్నారు. మూడేళ్ల వయసులోనే అదితిని జర్మనీకి తీసుకెళ్లినట్లు దీపక్ చెప్పారు. ఆ ట్రిప్ లో అదితి సంతోషం చూసి సమయం దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్లివస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 50 దేశాలకు వెళ్లి వచ్చామని తెలిపారు.

స్కూలు ఎగ్గొట్టకుండా ఎలా సాధ్యమైందంటే..
అదితి రెగ్యులర్ గా స్కూలుకు వెళుతుందని దీపక్ చెప్పారు. వారాంతాల్లో, స్కూలుకు సెలవులు ఇచ్చినపుడు, బ్యాంకు సెలవులు కలిసి వచ్చినపుడు.. ఇలా సెలవుల్లో ప్లాన్ చేసి టూర్ కు వెళతామని వివరించారు. శుక్రవారం సాయంత్రం నేరుగా స్కూలుకు వెళ్లి అదితిని పికప్ చేసుకుని ఎయిర్ పోర్టుకు వెళ్లడం, ఆదివారం రాత్రికి తిరిగి రావడం చేస్తామన్నారు. ఒక్కోసారి సోమవారం ఉదయం ఫ్లైట్ దిగి అదితి నేరుగా స్కూలుకు వెళ్లేదని పాప తల్లి అవిలాశ చెప్పారు.

టూర్లకు ఏటా రూ.21 లక్షలకు పైనే ఖర్చు..
విదేశాలను చుట్టి రావడానికి ఏటా 20 వేల పౌండ్లు (మన రూపాయల్లో 21 లక్షలకు పైమాటే) ఖర్చవుతోందని దీపక్ వివరించారు. ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నామని తామేమీ బాగా డబ్బున్న వాళ్లం కాదని చెప్పారు. అయితే, వీలైనంతగా పొదుపు చేస్తూ తమ కూతురుకు వివిధ దేశాలను, అక్కడి సంప్రదాయాలను పరిచయం చేయాలనే బలమైన సంకల్పంతో ఇదంతా చేస్తున్నట్లు వివరించారు. లండన్ లో తను, తన భార్య అవిలాశ అకౌంటెంట్లుగా పనిచేస్తున్నామని చెప్పారు. లండన్ లో ఎన్నడూ హోటల్ లో తినలేదని, తమకు సొంత కారు కూడా లేదని వివరించారు. వర్క్ ఫ్రం హోం చేయడం ద్వారా తమ చిన్న కూతురును బేబీ కేర్ సెంటర్ లో వదిలే ఇబ్బంది తప్పిందని, ప్రయాణ ఖర్చు కూడా తప్పిందని తెలిపారు.

ఏయే దేశాలు చుట్టొచ్చారంటే..
నేపాల్, సింగపూర్, థాయ్ లాండ్, నెదర్లాండ్స్, మొనాకో, జర్మనీ, నార్వే లతో పాటు దాదాపుగా యూరప్ లోని చాలా దేశాలకు వెళ్లి వచ్చినట్లు దీపక్ వివరించారు. ఈ పర్యటనలలో అదితికి కొత్త కొత్త స్నేహితులు పరిచయమయ్యారని, తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. ఇన్ని దేశాలు తిరిగినా తనకు మాత్రం నేపాల్ అంటే బాగా ఇష్టమని అదితి చెప్పింది. నేపాల్ లో తాను హార్స్ రైడింగ్ చేశానని, లాంగెస్ట్ కేబుల్ కార్ లో రైడ్ కు వెళ్లానని, ఎవరెస్ట్ శిఖరాన్ని చూశానని వివరించింది. నేపాల్ తో పాటు జార్జియా, ఆర్మేనియా దేశాలు కూడా బాగా నచ్చాయని అదితి తెలిపింది.

More Telugu News