USA: ఎన్నారైల్లో భయాందోళనలు.. అమెరికాలో భారీగా బియ్యం కొనుగోళ్లు!

Indians in usa resort to stockpiling rice after india bans rice exports
  • బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధంతో ఎన్నారైల్లో రేగిన కలకలం
  • బియ్యానికి కటకట తప్పదన్న ఆలోచనతో ముందస్తు కొనుగోళ్లకు తెగబడ్డ వైనం
  • సూపర్ మార్కెట్ల ముందు భారీ క్యూలు, అమెరికా అంతటా ఇదే సీన్
  • అనేక సూపర్ మార్కెట్లలో నిండుకున్న బియ్యం నిల్వలు, నో స్టాక్ బోర్డులు
బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో అమెరికాలోని ఎన్నారైల్లో తీవ్ర అలజడి చెలరేగింది. భవిష్యత్తులో బియ్యానికి కటకట తప్పదన్న భయంతో ఎన్నారైలు పెద్ద ఎత్తున బియ్యం కొనుగోళ్లకు తెరలేపారు. సూపర్ మార్కెట్ల వద్ద భారతీయులు సోనా మసూరీ బియ్యం కోసం క్యూకట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అనేక సూపర్ మార్కెట్లలో బియ్యం స్టాక్ నిండుకోవడంతో నో స్టాక్ బోర్డు కనిపించింది. 

అనేక మంది ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగులు తీశారు. అనుమతి ఉన్న మేరకు గరిష్ఠంగా కొనుగోళ్లకు తెగబడ్డారు. అమెరికా వ్యాప్తంగా ఇదే సీన్ కనిపిస్తోందని అక్కడి వారు చెబుతున్నారు. బియ్యం కొరత తప్పదన్న ఆందోళన భారతీయుల్లో నెలకొందని చెప్పారు. ఇప్పటికే అక్కడ పలు రకాల ఆహారవస్తువులకు కొరత ఉందని, తాజా పరిణామంతో బియ్యానికి కూడా కొరత ఏర్పడితే ఎలా అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

బాస్మతీయేతర బియ్యంపై భారత్ నిషేధం విధించిన వార్త లైవ్ టెలికాస్ట్ కాగానే భారతీయుల్లో గుబులు మొదలైందని అక్కడి భారతీయ స్టోర్ నిర్వాహకులు చెప్పారు. మరుసటి రోజు నుంచీ ఇండియన్స్ భారీ ఎత్తున బియ్యం కొనుగోళ్లకు దిగారని చెప్పారు. అదీ ఇదీ అని లేకుండా కనిపించిన ప్రతి వెరైటీనీ కొనుక్కున్నారని చెప్పారు. డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు కూడా పెంచాల్సి వచ్చిందని ఓ భారతీయు సూపర్ మార్కెట్ యజమాని పేర్కొన్నారు.
USA
Viral Videos
Rice Exports
India

More Telugu News