DY Chandrachud: హైకోర్టు జడ్జి తీరుపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి..!

  • ప్రయాణంలో అసౌకర్యం కలిగినందుకు వివరణ కోరుతూ రైల్వేకు హైకోర్టు న్యాయమూర్తి నోటీసు
  • ఘటనపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర అసంతృప్తి
  • హైకోర్టుల న్యాయమూర్తులకు లేఖ
  • ప్రోటోకాల్‌ను ప్రత్యేక అధికారంగా భావించరాదని సూచన
  • న్యాయవ్యవస్థ సింహావలోకనం చేసుకోవాలని అభిప్రాయపడ్డ చీఫ్ జస్టిస్
Chief Justices Self Reflection Tip over On Judges Train Journey Complaint

రైల్లో వసతులు లేక అసౌకర్యానికి లోనైన ఓ హైకోర్టు న్యాయమూర్తి రైల్వే నుంచి వివరణ కోరడంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రైల్వే సిబ్బంది హైకోర్టు పరిధిలోకి రారని, వారిపై న్యాయస్థానం క్రమశిక్షణ చర్యలు తీసుకోజాలదని వ్యాఖ్యానించారు. ప్రొటోకాల్ ప్రకారం కల్పించే సౌకర్యాల ఆధారంగా తమకు ప్రత్యేక హక్కులు ఉన్నట్టు భావించకూడదని సూచించారు. ఆ న్యాయమూర్తి చర్యతో న్యాయవ్యవస్థ లోపల, వెలువల అసంతృప్తి రేగిందని వ్యాఖ్యానించారు. 

ఇటీవల రైల్లో ప్రయాణిస్తున్న ఓ హైకోర్టు న్యాయమూర్తి తనకు కొన్ని వసతులు కల్పించకపోవడంతో ఆయన టీటీఈ నుంచి వివరణ కోరారు. కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నేరుగా రైల్వే శాఖకు కోర్టు రిజిష్ట్రార్‌తో లేఖ పంపించారు. రైల్వే తీరుతో తనకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. 

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ మొదలవడంతో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. దేశంలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరికీ లేఖ రాశారు. న్యాయవ్యవస్థలో ఇలాంటి విషయాలపై సింహావలోకనం, సమీక్ష జరగాలని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తుల కోసం ఉద్దేశించిన ప్రోటోకాల్‌తో ఇతరులకు ఇబ్బంది కలగకూడదని, న్యాయవ్యవస్థపై విమర్శలకు తావు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

More Telugu News