Chandrababu: ప్రతి ఒక్కరిపై రెండు సర్వేలు... నేతలు, కార్యకర్తల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చేలా చంద్రబాబు యాక్షన్ ప్లాన్

  • ఏపీలో దగ్గరపడుతున్న ఎన్నికలు
  • సన్నద్ధమవుతున్న టీడీపీ
  • కీలక నేతలతో తన నివాసంలో చంద్రబాబు భేటీ
  • దాదాపు 3 గంటల పాటు సాగిన సమావేశం
  • సర్వేల ఆధారంగా నేతల పనితీరుపై అంచనా
  • కష్టపడేవారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టీకరణ
Chandrababu held meeting with key leaders in TDP

ఏపీలో క్రమంగా ఎన్నికల వాతావరణం ముసురుకుంటోంది. ఎన్నికల దిశగా వివిధ పార్టీల కదలికలు ముమ్మరం అయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈసారి ఎన్నికల్లో అధికార వైసీపీని అత్యంత బలంగా ఢీకొట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు జనంలోకి వదిలిన టీడీపీ అధినేత చంద్రబాబు సమరశంఖం పూరించారు. 

తాజాగా, ఆయన పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా సన్నద్ధం చేయడంపై దృష్టి సారించారు. ఇవాళ టీడీపీలోని దాదాపు 15 మంది ముఖ్యనేతలతో తన నివాసంలో సుదీర్ఘ సమయం పాటు  సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీ 3 గంటల పాటు సాగింది. ఈ సమావేశం ప్రధానంగా పార్టీలోని వివిధ స్థాయులకు చెందిన నేతలు, కార్యకర్తలను దృష్టిలో ఉంచుకుని సాగింది. 

ఇప్పటికే ప్రజల కోసం భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో శక్తిమంతమైన మేనిఫెస్టోను రూపొందించిన చంద్రబాబు... ఇప్పుడు పార్టీలోని కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. దీనికి సంబంధించిన కార్యాచరణపైనే ఇవాళ్టి సమావేశంలో చర్చించారు. 

ఇందులో బూత్ స్థాయి ఇన్చార్జి నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుంది. బూత్ స్థాయి నుంచి వివిధ దశల ఇన్చార్జిలకు ఎప్పటికప్పుడు యాక్షన్ ప్లాన్ ఇచ్చేలా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కమిటీల సాయంతో గత మూడు ఎన్నికలకు సంబంధించిన డేటాను పరిశీలించి, నియోజకవర్గంలో ఈసారి ఏం చేయాలనే దానిపై పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని నియోజకవర్గ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

ఏ స్థాయిలో లోపాలు ఉంటే వాటిని ఆ స్థాయిలోనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ స్థాయుల్లోని ఇన్చార్జిలు, కార్యకర్తల పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు 10 మంది సభ్యులతో కూడిన స్పెషల్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గానికి ఒక కమిటీ ఉంటుంది. 

ఈ కమిటీలు యాక్షన్ ప్లాన్ రూపొందించడం తోపాటు, వాటి అమలుపై ప్రతి నెలా నివేదికలు రూపొందించి పార్టీ హైకమాండ్ కు అందిస్తాయి. ఈ ప్రక్రియ ఆన్ లైన్ లో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. నాలుగు దశల్లో ప్రతి ఒక్కరి పనితీరును పార్టీ అధినాయకత్వం మదింపు చేసి, వారికి పార్టీలో ప్రమోషన్లు, కీలక పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటుంది. 

ఇన్చార్జి అయినా, కార్యకర్త అయినా... ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చడమే ప్రధాన అజెండా అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కష్టపడి పనిచేసే నేతలను పార్టీ గుర్తించేందుకే తాజా కార్యాచరణకు రూపకల్పన చేసినట్టు వివరించారు. 

అయితే, ప్రతి ఒక్కరిపై రెండు సర్వేలు నిర్వహిస్తామని, దాని ఆధారంగానే పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని, నేతలు, కార్యకర్తలు ఈ విషయం గుర్తించి పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News