Bay Of Bengal: ఐదు రోజుల పాటు ఏపీని ముంచెత్తనున్న వర్షాలు

Heavy Rain Alert To Andhra Pradesh Due To Low Pressure In Bay Of Bengal
  • అల్పపీడన ప్రభావంతో చురుగ్గా మారిన రుతుపవనాలు
  • సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు హెచ్చరిక
  • ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు ఏపీలోని వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మరోవైపు, దక్షిణ ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో మరో ఆవర్తనం కొనసాగుతోంది.

దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఐదు రోజుల పాటు సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఏపీలోని ఉత్తర కోస్తాపై అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా ప్రాంతాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఏజెన్సీ, కొండ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. గడచిన 24 గంటల్లో అత్యధికంగా చింతూరులో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నయి. పాడేరు మండలం రాయగడ్డ వంతెన పొంగి 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పర్దనపుట్టు మత్స్యగెడ్డ పొంగి 50 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Bay Of Bengal
IMD
Low Pressure
Rain Alert
Andhra Pradesh

More Telugu News