Snakes: బాబోయ్ పాములు... వరదల వేళ ఢిల్లీ వాసులకు కొత్త సమస్య

  • ఉత్తరాదిన రుతుపవనాల జోరు
  • భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న యుమునా నది
  • వరదల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరం
  • వరద నీటితో పాటు భారీ సంఖ్యలో కొట్టుకొస్తున్న పాములు
  • ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటు చేసిన అధికారులు
Snakes spotted in Delhi flood water

నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలతో ముంచెత్తుతున్నాయి. యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని ఢిల్లీ వరదల్లో చిక్కుకుంది. అయితే, ఢిల్లీ వాసులకు ఇప్పుడో కొత్త సమస్య వచ్చిపడింది. 

వరద నీటితో పాటే పాములు కూడా కొట్టుకుని వస్తుండడంతో వారు హడలిపోతున్నారు. ఏ నీటిలో ఏ పాముందో తెలియక భయపడుతున్నారు. యమునా నదీ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు సమీప అటవీప్రాంతాలు, వ్యవసాయ భూముల మీదుగా వరద నీరు ఢిల్లీ నగరంలో ప్రవేశించింది. దాంతో పాములు కూడా ఆ వరద నీటితో పాటే దేశ రాజధానిలో ప్రవేశించాయి. 

వాటిలో చాలావరకు విషరహిత సర్పాలే అయినా, నాగుపాములు, కట్లపాముల వంటి ప్రమాదకర సర్పాలు కూడా వరద నీటిలో దర్శనమిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

పాముల బెడద అధికం కావడంతో ఢిల్లీ అధికారులు ఏకంగా రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటు చేశారు. 18001 18600 టోల్ ఫ్రీ నెంబరును కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ టీమ్ సభ్యులు ఓల్డ్ రైల్వే బ్రిడ్జి సమీపంలో పాతిక పాములను పట్టుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

More Telugu News