Odisha: ఒడిశాలో రెండు ముక్కలైన జాతీయ రహదారి బ్రిడ్జి

  • చెన్నై-కోల్‌కతాలను కలిపే జాతీయ రహదారి 16లో ఘటన
  • 2008లో నిర్మించిన బ్రిడ్జి.. నాణ్యతలేమి కారణంగా కూలినట్లు వెల్లడి
  • వంతెన పైకి రాకపోకల నిలిపివేత.. వాహనాల దారి మళ్లింపు
Bridge on NH 16 sinks in jeypore

ఒడిశాలోని జాజ్ పూర్ జిల్లా రసల్‌పూర్ బ్లాక్ సమీపంలో చెన్నై-కోల్‌కతాలను కలిపే జాతీయ రహదారి-16పై మంగళవారం వంతెన తెగిపోయింది. ఈ వంతెన కూలిపోయి.. రోడ్డు రెండు ముక్కలు కావడంతో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇందులో ఒకవైపు వంతెన రోడ్డుపైకి ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఈ వంతెన 2008లో నిర్మించారు. ఇది కూలిపోవడానికి గల కారణాలపై దర్యాఫ్తు చేస్తున్నట్లు NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ జేపీ వర్మ తెలిపారు. నాణ్యతలేమి కారణంగానే బ్రిడ్జి కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ప్రాథమికంగా నిర్మాణ వైఫల్యం కనిపిస్తోందని, నిపుణుల కమిటీ వచ్చాక ఎప్పుడు పునరుద్ధరించగలమో చెప్పలగమని జేపీ వర్మ తెలిపారు. 

ఒడిశా టీవీ ప్రకారం.. స్థానికులు కొంతమంది ఈ వంతెనలో కొంత భాగం ఒరిగిపోయినట్లు గుర్తించారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడి నుండి ఏ వాహనం కూడా వెళ్లలేదు. అంతకుముందు భువనేశ్వర్ వైపు వెళ్తోన్న ఓ బస్సు ఉదయం వంతెనను దాటింది. ఆ తర్వాత ఆ వంతెన నిర్మాణంలోని ఓ స్పాన్ క్రమంగా పడిపోవడాన్ని స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున శబ్దంతో కిందకు పడిపోయి, రెండుగా విడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ ట్రాక్టర్ డ్రైవర్, ఓ హోంగార్డ్ అప్రమత్తమై వంతెన పైకి రాకపోకలను నిలిపివేశారు.

శ్రీధర్ దాస్ అనే స్థానికుడు ఒడిషా టీవీతో మాట్లాడుతూ.. తాము వంతెన దగ్గరలో కూర్చున్నామని, ఆ సమయంలో వాహనం వెళుతున్నప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని, వెంటనే అక్కడకు వెళ్లి చూడగా వంతెన భాగం కూలుతున్నట్లుగా కనిపించిందని చెప్పాడు. విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్న కౌకియా పోలీసులు వందలాది వాహనాలను మళ్లించారు.

More Telugu News