Andhra Pradesh: అధికార పార్టీ నుంచి బయటకు వెళ్తున్నా.. ఇందులో రాజకీయ లబ్ది ఏముంటుంది?: పంచకర్ల

  • ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలో చేరితే లబ్ది ఉంటుందని వ్యాఖ్య
  • పవన్ కల్యాణ్ సేవా భావం చూసి జనసేనలో చేరుతున్నట్లు వెల్లడి
  • పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధమని వివరణ
  • రాబోయే రోజుల్లో జనసేనలోకి భారీగా చేరికలు ఉంటాయని జోస్యం
Panchakarla Ramesh Babu Press Meet

పవన్ కల్యాణ్ సేవాభావం, పార్టీ విధివిధానాలపై ఆకర్షణతో జనసేనలో చేరుతున్నట్లు విశాఖ వైసీపీ నేత పంచకర్ల రమేశ్ బాబు వెల్లడించారు. పార్టీ మారాలన్న నిర్ణయం పూర్తిగా తనదేనని, అన్ని రకాలుగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులను తన సొంత డబ్బుతో ఆదుకున్న ఒకే ఒక్క నేత పవన్ కల్యాణ్ అని అన్నారు. ప్రభుత్వపరంగా సాయం ప్రకటించడంలో గొప్పేమీ లేదని, సొంత డబ్బును పేదలకు పంచడం గొప్ప విషయమని పంచకర్ల మెచ్చుకున్నారు.

అది పవన్ కల్యాణ్ మాత్రమే చేస్తున్నారని వివరించారు. ఈమేరకు మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన పంచకర్ల.. పార్టీ మారుతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 20న జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి తాను ఒక్కడినే చేరుతున్నప్పటికీ.. రాబోయే రోజుల్లో జనసేనలోకి భారీగా చేరికలు ఉంటాయని పంచకర్ల రమేశ్ బాబు వెల్లడించారు.

తాజా నిర్ణయంతో ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి మారితే ఏమైనా లబ్ది ఉంటుందనుకోవచ్చు కానీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళితే రాజకీయ లబ్ది ఏముంటుందని అడిగారు. పెందుర్తి నుంచి పోటీ చేస్తానంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా పంచకర్ల వివరణ ఇచ్చారు.

పెందుర్తిలో తన అభిమానులతో జరిగిన భేటీలో ఆ వ్యాఖ్యలు చేసిన విషయం వాస్తవవమేనని చెప్పారు. అప్పుడు తాను ఏ పార్టీలోనూ లేనని గుర్తుచేశారు. ఈ నెల 20న జనసేనలో చేరబోతున్నానని, పార్టీ అధిష్ఠానం సూచనలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. పార్టీ అప్పగించిన పనిని చిత్తశుద్ధితో పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తానని వివరించారు. తనను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలనే నిర్ణయం పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ చేతుల్లో ఉంటుందని తెలిపారు.

More Telugu News