Andhra Pradesh: ఏపీలో బీజేపీ బలం పుంజుకోవాలి.. పురందేశ్వరి

  • సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలంటూ పార్టీ నేతలకు సూచన
  • బూత్ కమిటీలు, మండల కమిటీలను బలోపేతం చేయాలన్న బీజేపీ ఏపీ చీఫ్
  • రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం నెలకొందని వ్యాఖ్యలు
BJP Ap president Daggubati Purandeswari Pressmeet

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలం పుంజుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకుని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చెప్పారు. ఇందుకోసం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు. బూత్ కమిటీల నుంచి మండల కమిటీలను పటిష్ఠం చేసే దిశగా పార్టీ నాయకులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈమేరకు ఆదివారం నిర్వహించిన పార్టీ ప్రెస్ మీట్ లో పురందేశ్వరి మాట్లాడారు.

రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగాలని పురందేశ్వరి అన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రతీ కార్యకర్త శ్రమిస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఎన్నికల హామీలు అన్నింటినీ నెరవేర్చామని జగన్ సహా వైసీపీ నేతలంతా చెబుతున్నారని పురందేశ్వరి గుర్తుచేశారు. నిజంగానే హామీలన్నీ అమలయ్యాయా, ప్రజలు ఏమంటున్నారనేది ప్రత్యక్షంగా కలిసి తెలుసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతున్నారని, వారితో పాటు కలిసి సమస్యలపై పోరాడితే బీజేపీని వారు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే ఉందన్న పురందేశ్వరి.. ఈ తక్కువ సమయంలోనే అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పురందేశ్వరి కోరారు.

More Telugu News