YSRCP: ఇళ్లు ఇచ్చేది లేదు.. ఏంచేసుకుంటావో చేసుకో!: ఎమ్మెల్యే కన్నబాబు

MLA Kannababu Fires on CPM Leader in Jaganna suraksha programme at anakapalli
  • సీపీఎం నాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎలమంచిలి ఎమ్మెల్యే
  • అనకాపల్లి జిల్లాలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఘటన
  • జగనన్న కాలనీలో ఇళ్లు ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించిన సీపీఎం నేత సత్యనారాయణ
జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయడం లేదని ప్రశ్నించిన సీపీఎం నేతపై అధికార పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇళ్లు ఇచ్చేది లేదని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. లబ్దిదారులకు లేని సమస్య నీకెందుకని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వెంకటాపురంలో శనివారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వెంకటాపురంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు (కన్నబాబు) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కలిసిన సీపీఎం స్థానిక నాయకుడు సత్యనారాయణ నిరుపేదలకు ఇళ్లు ఇస్తామన్న హామీని ప్రస్తావించారు. గ్రామంలో ఇళ్లులేని 94 మంది నిరుపేదలను గుర్తించి వారికి జగనన్న కాలనీలో ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ హామీని ఇప్పటి వరకూ అమలు చేయలేదని, పేదలకు ఇళ్లు ఇంకెప్పుడు ఇస్తారని ఎమ్మెల్యేను నిలదీశారు.

దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే కన్నబాబు.. ఇల్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. గ్రామంలో ఇటీవల నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటి కోసం 15 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. లబ్దిదారులకు లేని సమస్య మీకెందుకని ప్రశ్నించారు. ఇల్లు ఇవ్వబోమని, ఏం చేసుకుంటావో చేసుకోమని ఎమ్మెల్యే అనడంతో కార్యక్రమానికి హాజరైన జనం విస్తుపోయారు. కాగా, నిరుపేద కుటుంబాలకు ఇళ్లు దక్కేవరకూ సీపీఎం పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఆ పార్టీ నేత సత్యనారాయణ స్పష్టం చేశారు.
YSRCP
Andhra Pradesh
Mla kannababu
Elamanchili
jagananna surakhsa
anakapalli

More Telugu News