Asaduddin Owaisi: మీ ఇళ్లలో గేదెలు పాలు ఇవ్వకున్నా దానికి ముస్లింలే కారణమని నిందిస్తారు: అసదుద్దీన్ ఒవైసీ

  • ముస్లిం వ్యాపారుల వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయన్న అసోం సీఎం
  • వాళ్ల ఇంట్లో కోడి గుడ్డు పెట్టకున్నా దానికి ‘మియా’లే కారణమంటారన్న ఒవైసీ
  • వాళ్ల వ్యక్తిగత వైఫల్యాలను ముస్లింలపై రుద్దుతున్నారని మండిపాటు
Owaisi Taunts Himanta Sarma For Miya Remark

ముస్లిం వ్యాపారుల వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. వాళ్ల వ్యక్తిగత వైఫల్యాలను ముస్లింలపై రుద్దుతున్నారని మండిపడ్డారు. ‘‘మీ ఇళ్లలో గేదెలు పాలు ఇవ్వకపోయినా దానికి ముస్లింలే కారణమని నిందిస్తారు” అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు అసద్ ట్వీట్ చేశారు. 

‘‘దేశంలో ఓ గ్రూపు ఉంది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టకపోయినా దానికి ‘మియా’లే కారణమని అంటారు. వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారు” అని ట్వీట్ చేశారు. ‘‘విదేశీ ముస్లింలతో ప్రధానికి మంచి స్నేహం ఉంది కదా.. టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఇవ్వమని అడగొచ్చు కదా” అంటూ సెటైర్లు వేశారు. 

శుక్రవారం ముస్లిం వ్యాపారులపై హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘కూరగాయల ధరలను ఇంతగా పెంచిన వ్యక్తులు ఎవరు? వాళ్లు మియా (బెంగాలీ మాట్లాడే ముస్లింలు) వ్యాపారులు.. కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు” అని అన్నారు.

‘‘మియా వ్యాపారులు గువాహటిలో అసోం ప్రజలకు అధిక ధరలకు కూరగాయలను అమ్ముతున్నారు. ఇదే సమయంలో గ్రామాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ అస్సామీ వ్యాపారులు కూరగాయలు అమ్ముతున్నట్లయితే.. వారు తమ అస్సామీ ప్రజల నుంచి ఎన్నడూ ఎక్కువ వసూలు చేయరు” అని ఆయన చెప్పారు.

More Telugu News