3 వారాల గరిష్ఠానికి... మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు
- పదిహేను నెలల కనిష్ఠానికి అమెరికా డాలర్
- రెండేళ్ల కనిష్ఠానికి అమెరికా సీపీఐ ద్రవ్యోల్భణం
- సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరగకపోవచ్చుననే అంచనాలు
- పసిడిపై ఈ అంశాల ప్రభావం.. దీంతో పెరుగుదల
అంతకుముందు తగ్గిన బంగారం ధరలు గతవారం నుండి పెరుగుతూ వస్తున్నాయి. దీనిపై బులియన్ మార్కెట్ నిపుణులు మాట్లాడుతూ... కిందటి వారం అమెరికా సీపీఐ డేటా విడుదలైందని, ఈ డేటా ప్రకారం ద్రవ్యోల్భణం రెండేళ్ల కనిష్ఠానికి చేరుకుందని తెలిపారు. అదే సమయంలో యూఎస్ ఫెడ్ సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెంచదనే అంచనాలు కూడా ఉన్నాయన్నారు. దీంతో అమెరికా డాలర్ నష్టపోయిందని, ఏకంగా పదిహేను నెలల కనిష్ఠానికి చేరుకున్నట్లు చెప్పారు. ఈ అంశాలు బంగారం పెరుగుదలకు కారణమైనట్లు చెప్పారు.
డాలర్ ఇండెక్స్ పదిహేను నెలల కనిష్ఠానికి చేరుకోవడం, ద్రవ్యోల్భణం అంచనాలకు మించి ఉండటంతో, ఫెడ్ వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించవచ్చునని భావిస్తున్నారని, ఈ ప్రభావం పసిడిపై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పసిడి ధరలు మూడు వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి. జూన్ మాసంలో సీపీఐ ఏడాది ప్రాతిపదికన 3.1 శాతం వరకు ఉండవచ్చునని అంచనా వేయగా, 3 శాతం నమోదయింది.