Dasoju Sravan: రేవంత్ రెడ్డి అనుచరులమంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: దాసోజు శ్రవణ్

BRS Dasorju Sravan received threat calls
  • అంతు చూస్తామని బెదిరిస్తున్నారన్న బీఆర్ఎస్ నేత
  • రేవంత్ ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు వెల్లడి
  • అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పదేపదే ఫోన్ కాల్స్ వచ్చాయన్న దాసోజు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుల పేరిట తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ శుక్రవారం తెలిపారు. తన అంతు చూస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఫోన్లో తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ రేవంత్ ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ సైబర్ క్రైమ్ డిపార్టుమెంట్‌తో పాటు సంబంధిత పోలీస్ అధికారులకు శ్రవణ్ ట్వీట్ చేశారు. బెదిరింపు కాల్స్ చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ... తెలంగాణలో బెదిరింపు, రౌడీ రాజకీయాల సంస్కృతిని పెంచి పోషించే పనిలో రేవంత్ ఉండటం దురదృష్టకరమన్నారు. ఫోన్ నెంబర్స్ ఆధారంగా డీజీపీకి, నగర పోలీస్ కమిషనర్ కు, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి గం.12.15 నుండి రేవంత్ అనుచరులమంటూ కొంతమంది తనకు అదేపనిగా ఫోన్ చేశారని, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ, హెచ్చరికలు జారీ చేశారని ట్వీట్ కూడా చేశారు.
Dasoju Sravan
Revanth Reddy
BRS
Congress

More Telugu News