Gurukul Students: స్కూల్‌లో మద్యం తాగిన గురుకుల విద్యార్థులు.. టీచర్‌ను ఇరికించే ప్రయత్నం

  • ములుగు జిల్లా మల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఘటన
  • స్కూల్‌లోనే మందుకొట్టిన ఏడుగురు తొమ్మిదో తరగతి, ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు
  • మద్యం విక్రయించిన వైన్‌షాప్‌పై కేసు
  • టీచర్‌ను ఇరికించే ప్రయత్నంలో దొరికిపోయిన విద్యార్థులు
Mallampalli Gurukul Students Consumed Liquor in School

స్కూల్‌లోనే విద్యార్థులు మందుకొట్టారు. ఆపై టీచర్‌ను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిందీ ఘటన. తొమ్మిదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న 9 మంది విద్యార్థులు శనివారం రాత్రి మల్లంపల్లిలోని ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఏకంగా స్కూలుకే తీసుకొచ్చి తాగారు. చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు వారిని మందలించి మరోసారి ఇలాంటి పనులు చేయబోమని వారితో రాయించుకున్నారు. 

మరుసటి రోజు విద్యార్థులు ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుడే మద్యం తాగి తమతో ఒప్పంద పత్రం రాయించుకున్నట్టు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కోపంతో హాస్టల్‌కు వచ్చి ఉపాధ్యాయులను నిలదీశారు. వారి ఫిర్యాదు మేరకు సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్ కోఆర్డినేటర్ విద్యారాణి, తహసీల్దారు సత్యనారాయణస్వామి పాఠశాలకు వెళ్లి విచారించగా విద్యార్థులే మద్యం తాగినట్టు వెల్లడైంది.

ఏడుగురు తొమ్మిదో తరగతి, ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు మద్యం తాగినట్టు తేల్చారు. వీరిలో ఎక్కువమంది ఏటూరునాగారం మండలానికి చెందిన వారుగా తెలుస్తోంది. కాగా, ఇప్పటి వరకు విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అంకయ్య తెలిపారు. మరోవైపు, విద్యార్థులకు మద్యం విక్రయించినందుకు మల్లంపల్లి శ్రీరామ వైన్స్‌పై కేసు నమోదు చేసినట్టు ములుగు ఎక్సైజ్ సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి విద్యార్థులు మద్యం కొనుగోలు చేసినట్టు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించినట్టు తెలిపారు.

More Telugu News