tomato: టమాటా ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు.. ఏపీ సహా మూడు రాష్ట్రాల నుండి సేకరణ

Centres new directive to control spiralling prices of tomatoes
  • ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుండి టమాటాలు కొనుగోలు చేయాలని ఆదేశం
  • ఢిల్లీ-ఎన్సీఆర్ సహా అధిక ధరలున్న ప్రాంతాల్లో తగ్గింపు ధరలకు విక్రయించాలని నిర్ణయం
  • త్వరలో టమాటా ధర దిగి వస్తుందని వెల్లడి

టమాటా ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో సామాన్యులపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం చర్యలు ప్రకటించింది. ధరల నియంత్రణకు గాను పలు రాష్ట్రాల నుండి టమాటాను సేకరించాలని నిర్ణయించింది. ప్రధాన వినియోగ కేంద్రాలలో పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుండి కొనుగోలు చేయాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ... నాఫెడ్, NCCF వంటి సహకార సంస్థలను ఆదేశించింది. ఆ తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో రిటైల్ ఔట్ లెట్ల ద్వారా తగ్గింపు ధరలకు విక్రయించబడతాయని సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో టమాటా ధరలు కిలోకు రూ.100 కంటే పైగా ఉన్నాయి. కొన్నిచోట్ల రూ.200 తాకింది. పలు రాష్ట్రాల నుండి టమాటాను సేకరించిన అనంతరం జులై 14 నుండి ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లోని ప్రజలకు రాయితీపై అందించనుంది. పలు ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గింది. సరకు రవాణాలో అంతరాయం ఏర్పడింది. దీంతో టమాటా ధర రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అత్యధిక ధర పలుకుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి రిటైల్ కేంద్రాల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

సాధారణంగా జులై - ఆగస్ట్, అక్టోబర్-నవంబర్ కాలంలో టమాటా ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. జులైలో అకాల వర్షాల కారణంగా దిగుమతి పడిపోయింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సతారా, నారాయణగాన్, నాసిక్ ప్రాంతాల నుండి గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు టమాటా వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె నుండి టమాటా సరైన పరిమాణంలో వస్తోంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక నుండి ఢిల్లీకి వస్తోంది. త్వరలో మహారాష్ట్రలోని నారాయణగావ్, ఔరంగాబాద్ లతో పాటు మధ్యప్రదేశ్ నుండి త్వరలో అదనపు పంట రానుంది. దీంతో త్వరలో టమాటా ధరలు దిగి వచ్చే అవకాశముందని కేంద్రం చెబుతోంది.

  • Loading...

More Telugu News