Revanth Reddy: ఉచిత విద్యుత్‌పై వ్యాఖ్యల వివాదం.. రేవంత్ రెడ్డి ట్వీట్!

TPCC chief Revanth Reddy tweets on free electricity dispute
  • కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు దుష్ఫ్రచారం చేస్తున్నారన్న రేవంత్
  • 3 చెరువుల నీళ్లు తాగినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదని వ్యాఖ్య
  • రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్సేనని వెల్లడి
తెలంగాణలో 95 శాతం మంది చిన్న, సన్నకారు రైతులేనని, 3 ఎకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు 3 గంటల విద్యుత్‌ చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. మొత్తంగా 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని.. కేవలం విద్యుత్ సంస్థల కమీషన్లకు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అనే నినాదం తీసుకొచ్చారని రేవంత్‌ చెప్పడంపై బీఆర్ఎస్‌ తీవ్రంగా మండిపడింది. ఈ రోజు తెలంగాణవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. 

ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు ‘మూడు గంటలు’ అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా.. మీరు మూడోసారి అధికారంలోకి రావడం కల్ల” అని పేర్కొన్నారు. 
 
‘‘వచ్చేది కాంగ్రెస్.. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్” అని రేవంత్ చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామంటూ కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతున్న వీడియోను ట్వీట్‌కు జత చేశారు. బైబై కేసీఆర్‌‌ హ్యాష్‌ ట్యాగ్‌ను జతచేశారు. 
Revanth Reddy
free power
BRS
Telangana
Congress

More Telugu News