Telangana: టీ కాంగ్రెస్ కొత్త వ్యూహం.. సెటిలర్స్, సినీ పరిశ్రమపై దృష్టి!

  • కర్ణాటకలో విజయం, ఖమ్మం సభ సక్సెస్ తర్వాత కాంగ్రెస్ లో జోష్
  • గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మంలో కీలకం కానున్న సెటిలర్లు
  • వారితో పాటు సినీ పరిశ్రమ పెద్దలు, కార్మికులను ఆకట్టుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకత్వం
Telangana Congress to Focus on settlers and film industry for assembly elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు, అస్త్రాలకు పదును పెడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం, ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ సక్సెస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ జోష్ లో కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఆ పార్టీ అధి నాయకత్వం సరికొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. 

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెటిలర్స్ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకురావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాలు, ఆంధ్రతో సరిహద్దు పంచుకుంటున్న ఖమ్మంలో ఎక్కువగా ఉన్న ఆంధ్ర సెటిలర్లతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారిని తమవైపునకు తిప్పుకునేందుకు టీకాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం.

గులాబీ పార్టీ నేతల వైఖరిపై ఆంధ్ర సెటిలర్స్‌లో ఓ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని హస్తం నాయకులు చూస్తున్నారు. రానున్న ఎన్నికల్లో సెటిలర్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేలా నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయా  ప్రాంతాల్లోని సెటిలర్స్‌తో చర్చలు జరుపుతున్నారు. 

మరోవైపు సినీ ఇండస్ట్రీలోని కార్మికుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన వైఖరిని తీసుకోవడం, గతంలో సినీ పరిశ్రమ అభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సినీ పరిశ్రమ లేదంటే సెటిలర్స్ నుంచి మంత్రివర్గంలో ఒకరికి చోటు కల్పించాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అదే విషయాన్ని సెటిలర్స్, సినీ పరిశ్రమ వారికి చేరవేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.

More Telugu News