JEE Aspirant: రాజస్థాన్‌లో మిస్టరీగా ఇంజినీరింగ్ ఆశావహుల ఆత్మహత్యలు.. ఈ ఏడాది ఇప్పటి వరకు 15 మంది బలవన్మరణం

  • తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య
  • కోచింగ్ కోసం రెండు నెలల క్రితమే యూపీ నుంచి కోటాకు
  • ఆత్మహత్యలకు పురికొల్పుతున్న ఒత్తిడి!
Another JEE aspirant dies by suicide in Kota

రాజస్థాన్‌లో ఇంజినీరింగ్ ఆశావహుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడడం లేదు.  కోటాలో జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థి తాజాగా తన హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన కోటాలో ఈ ఏడాది ఇది 15వ ఆత్మహత్య కావడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాకు చెందిన బాధిత విద్యార్థి రెండు నెలల క్రితం శిక్షణ కోసం కోటా వచ్చి ఓ ఇనిస్టిట్యూట్‌లో జేఈఈకి శిక్షణ తీసుకుంటున్నాడు. 

మూడు నాలుగు రోజులుగా కోచింగ్ క్లాసులకు డుమ్మా కొడుతున్న విద్యార్థి శనివారం ఉదయం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. కోచింగ్ సెంటర్‌ నుంచి అతడి పెర్ఫార్మెన్స్‌ను, స్కోరింగ్ స్టేటస్‌ను తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. తాజా ఘటనతో కోటాలో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 15కి పెరిగింది.

కోటాలోని వివిధ కోచింగ్ సెంటర్లలో దాదాపు 2.25 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం శిక్షణ తీసుకుంటున్నారు. తీవ్రమైన ఒత్తిడి, తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న అంచనాలు విద్యార్థుల ఆత్మహత్యకు దారితీస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News