Sri Lanka: ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా... ఐసీసీ క్వాలిఫయర్ టోర్నీలో విజేతగా నిలిచిన శ్రీలంక

  • జింబాబ్వేలో ముగిసిన ఐసీసీ క్వాలిఫయర్ టోర్నీ
  • ఫైనల్లో నెదర్లాండ్స్ పై శ్రీలంక భారీ విజయం
  • భారత్ లో జరిగే వరల్డ్ కప్ కు అర్హత సాధించిన శ్రీలంక, నెదర్లాండ్స్
Unbeaten Sri Lanka claims ICC Qualifiers Tourney title by beating Nederlands in final

భారత్ లో జరిగే వరల్డ్ కప్ కోసం ఐసీసీ క్వాలిఫయర్ టోర్నీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి. 

కాగా, ఈ క్వాలిఫయర్ టోర్నీలో శ్రీలంక జట్టు విజేతగా నిలిచింది. నిన్న (జులై 9) జింబాబ్వేలోని హరారేలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక జట్టు 128 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్ ను ఓడించింది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్... శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించింది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు 47.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటయ్యారు. అనంతరం, లక్ష్యఛేదనలో డచ్ జట్టు 23.3 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలి భారీ ఓటమి చవిచూసింది. శ్రీలంక జట్టులో స్పిన్నర్ మహీశ్ తీక్షణ 4 వికెట్లు తీయగా, దిల్షాన్ మధుశంక 3, వనిందు హసరంగ 2 వికెట్లు పడగొట్టారు. 

కాగా, ఈ క్వాలిఫయర్ టోర్నీలో శ్రీలంక జట్టు ఒక్క మ్యాచ్ లోనూ ఓడిపోకుండా విజయంతో ముగించడం విశేషం. గ్రూప్ దశలోనూ, సూపర్ సిక్స్ దశలోనూ, ఫైనల్లోనూ లంకకు ఎదురులేకుండా పోయింది.

More Telugu News