Etela Rajender: మన కళ్లల్లో మన్ను కొట్టిన కేసీఆర్ ను ఓడిద్దాం: మోదీ సభలో ఈటల

  • బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మూడేళ్లుగా లోపాయికారీ ఒప్పందం ఉందన్న ఈటల
  • బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని కొన్ని పేపర్లు, ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపాటు
  • బంగారు తెలంగాణ అంటే ఏమిటో బీజేపీ చూపెడుతుందని వ్యాఖ్య
Etela Rajender fires on KCR in Modi sabha

తెలంగాణకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ గడ్డపై అడుగుపెట్టారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను నిర్మించి, ఎప్పటి నుంచో మనం కలలుగన్న రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేసిన ఈరోజు ఉత్తర తెలంగాణకు శుభసూచకమని చెప్పారు. బీజేపీతోనే తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు. 

కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, దీనికి కేంద్రంలో అధికారంలో వున్న  బీజేపీ సహకరించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఈటల చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని కొన్ని పేపర్లు, ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని... బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే లోపాయకారీగా పని చేస్తున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం మూడు సంవత్సరాలుగా కొనసాగుతోందని చెప్పారు. వరంగల్ లో పలు కార్యక్రమాలకు ఈరోజు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తప్పుడు హామీలిచ్చి, మన కళ్లల్లో మన్ను కొట్టిన కేసీఆర్ ను ఓడించాలని ప్రజలను ఈటల కోరారు. రాష్ట్ర ప్రజల బతుకేందో, కన్నీళ్లు ఏందో తెలిసిన బిడ్డగా చెపుతున్నానని... బీజేపీనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ మాటల్లోనే ఉందని... అసలైన బంగారు తెలంగాణను చేతలతో బీజేపీ చూపెడుతుందని... అందుకే బీజేపీని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. 

More Telugu News