Nagababu: అరేయ్ పిచ్చోళ్లారా.. మా అమ్మ రెల్లి కులంలో పుట్టి ఉంటే గర్వంగా చెప్పుకునే వాళ్లం: నాగబాబు

  • పవన్ కల్యాణ్ తల్లి రెల్లి కులంలో పుట్టిందని వ్యాఖ్యానించిన వైసీపీ నేత
  • సమాజంలోని నీచాన్ని శుభ్రం చేసేది రెల్లి కులస్తులేనన్న నాగబాబు
  • వాళ్లకు చేతులెత్తి దండం పెట్టాలని వ్యాఖ్య
  • రెల్లి కులస్తులంటే లోకువయిపోయారా అంటూ వైసీపీపై మండిపాటు
  • తాను కాపుగా పుట్టినందుకు గర్వపడుతున్నానన్న నాగబాబు
We would be happy if my mother born in Relli caste says Nagababu

స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారని సినీ నటుడు, జనసేన నేత నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులనే వాడు, వీడు అని మాట్లాడే స్థితికి నాయకులు దిగజారిపోయారని మండిపడ్డారు. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ పెళ్లాలు, పెళ్లిళ్లు, తల్లులు, పిల్లల గురించి మాట్లాడుతూ ఒకరి బొక్కల్ని మరొకరు బయటపెట్టుకుంటున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ తల్లి రెల్లి కులస్తురాలని, కానీ పవన్ తన తల్లి కులం గురించి ఎక్కడా మాట్లాడరంటూ వైసీపీ నేతలు అంటున్నారని ఆయన మండిపడ్డారు. 

గత ఎన్నికల సమయంలో రెల్లి కులాన్ని తాను దత్తత తీసుకుంటానని పవన్ చెప్పారని... ఎందుకంటే ఆ కులాన్ని మన సమాజం చాలా తక్కువ చేసి చూసిందని నాగబాబు అన్నారు. కాపు కులంలో పుట్టినందుకు తాను గర్వపడతానని, గర్వపడాలి కూడా అని చెప్పారు. ఏ వ్యక్తి అయినా వారి కులంలో పుట్టినందుకు గర్వపడతాడని అన్నారు. 

నిజంగా తమ తల్లి రెల్లి కులంలో పుట్టి ఉంటే తామంతా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవారమని నాగబాబు చెప్పారు. రెల్లి కులస్తులను సఫాయి కార్మికులు అంటారని... సమాజంలోని కుళ్లుని, చెత్తని, నీచాన్ని శుభ్రం చేసి, మనకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేది రెల్లి కులస్తులేనని తెలిపారు. అలాంటి వాళ్లకు మనం చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. వైసీపీ వాళ్లకు రెల్లి కులస్తులంటే లోకువయిపోయారని మండిపడ్డారు. 'అరేయ్ పిచ్చోళ్లారా.. మా అమ్మ రెల్లి కులంలో పుట్టి ఉంటే బాధ పడంరా... సంతోషపడతాం రా' అని అన్నారు. తమకు కులం, జాతి అనే భేదాలు ఉండవని చెప్పారు. అన్ని కులాలను సమానంగా చూసే సంస్కారాన్ని తమ తండ్రి నేర్పించారని అన్నారు.

More Telugu News