Ameesha Patel: నా సక్సెస్ చూసి ఓర్వలేకపోయారు, నా సినిమాలను లాగేసుకున్నారు: అమీషా పటేల్

Ameesha patel says some of her fellow actors were jealous of her success
  • కరీనా కపూర్, ఈషా డియోల్ పేర్లను ప్రస్తావించిన అమీషా 
  • సెట్‌లో తనమానాన తాను ఉండేదాన్నని వెల్లడి 
  • తనకు అతిశయం ఎక్కువని జనాలు అనుకున్నట్టు వెల్లడి
బాలీవుడ్ నటి అమీషా పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. తన సక్సెస్‌ చూసి కొందరు సహనటులు ఓర్వలేకపోయారని, తాను చేయాల్సిన సినిమాలు లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

హృతిక్ రోషన్ సరసన 2000లో హిట్ మూవీ కహోనా ప్యార్‌ హై సినిమాతో అమీషా పటేల్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బంపర్ హిట్ కావడంతో అమీషా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. 

‘‘నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో కాలుపెట్టిన సమయంలో నాతో పాటూ గొప్ప యాక్టర్లు, నిర్మాతలు పిల్లలు అరంగేట్రం చేశారు. కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, తుషార్ కపూర్, ఈషా డియోల్, ఫర్దీన్ ఖాన్.. ఇలా ఎటు తలతిప్పినా సినీకుటుంబాలకు చెందిన మూడో తరం వారు కనిపించేవారు. నేనొక్కత్తినే బయటదాన్ని. సెట్లో నామానాన నేను ఉండేదాన్ని. పుస్తకాలు చదువుకునేదాన్ని. ఎవరిపైనా రూమర్స్ గురించి మాట్లాడేదాన్ని కాదు. సెట్లో చీటికీమాటికీ అలకలుబూనే దాన్ని కాదు. దీంతో, నేనేదో అతిశయంగా ఉంటున్నట్టు జనాలు భావించేవారు. నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. దీంతో, దేవుడు వరుస హిట్లు ఇచ్చి ఆదుకున్నాడని అనుకున్నా. కానీ నా సహచర నటులు మాత్రం అలా భావించలేదు. వారు నా సక్సెస్ చూసి ఓర్వలేకపోయారు. కొందరు నా నుంచి సినిమాలను కూడా లాగేసుకున్నారు’’ అని ఆమె చెప్పుకొచ్చారు. తన నటనతో తెలుగు సినీ ప్రేక్షకులనూ అమీషా పటేల్ అలరించింది.
Ameesha Patel
Bollywood
Kareena Kapoor
Esha Deol
Hrithik Roshan
Abhishek Bachchan

More Telugu News