CI Swarnalatha: సినిమాపిచ్చిలో పడిన విశాఖ సీఐ స్వర్ణలత.. నోట్ల మార్పిడి కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

  • పక్కా ప్లాన్‌తో రూ. 12 లక్షలు కొట్టేసిన సీఐ
  • బాధితుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి
  • సినిమాలంటే పిచ్చి.. ‘ఏపీ 31’ పేరుతో సినిమా
  • కొరియోగ్రాఫర్‌ను పెట్టుకుని శిక్షణ
  • ఇటీవల ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్
Vizag AR CI Swarnalatha Arrested

విశాఖపట్టణం నోట్ల మార్పిడి కేసులో ఇద్దరు వ్యక్తులను బెదిరించి రూ. 12 లక్షలు వసూలు చేసిన ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమాలపై ఇష్టం పెంచుకున్న ఆమె ‘ఏపీ 31’ పేరుతో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గానూ నటిస్తోంది. ఆ చిత్రంలో భాగస్వామిగానూ వ్యవహరిస్తున్నట్టు సమాచారం.

రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలు కూడా అయిన స్వర్ణలత ఆ మధ్య ఒకసారి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పంచ్ డైలాగ్స్‌తో విరుచుకుపడడం కూడా సినిమాల ప్రభావమేనని అంటున్నారు. తాజా కేసుకు సంబంధించి పోలీస్ కమిషనర్ త్రివిక్రమవర్మ కథనం ప్రకారం.. గాజువాకకు చెందిన విశ్రాంత నేవీ ఉద్యోగులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ వి.సూరిబాబు నోట్ల మార్పిడికి సంబంధించి ఆశ పెట్టాడు. రూ. 90 లక్షల విలువైన రూ. 500 నోట్లు ఇస్తే  కోటి రూపాయల విలువైన రూ. 2 వేల నోట్లు ఇస్తామని, దీంతో రూ. 10 లక్షలు మిగులుతుందని ఆశ చూపాడు.

పక్కా ప్లాన్‌తోనే..
సరేనన్న వారిద్దరూ గురువారం రాత్రి సీతమ్మధారలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి వద్దకు డబ్బుతో చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సూరిబాబు వారివద్ద డబ్బు చూసి ఆ విషయాన్ని ఎవరికో ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే సీఐ స్వర్ణలత, ఆమె వాహనం డ్రైవర్ కానిస్టేబుల్ హేమసుందర్ అలియాస్ మెహర్, హోంగార్డు శ్రీను అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో శ్రీను, శ్రీధర్ వద్దనున్న డబ్బు చూసి బెదిరించారు. తనకు రూ. 12 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తానని చెప్పడంతో అడిగినంతా ఇచ్చేసి వెళ్లిపోయారు. 

ముందస్తు పథకం ప్రకారమే
అంతకుముందు సూరి ఎవరికో ఫోన్ చేయడంతో అతడే ఈ నాటకం ఆడాడని అనుమానించిన బాధితులు ఆ తర్వాతి రోజున డీసీపీ విద్యాసాగర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను అదుపులోకి తీసుకుని మూడు కేసులు నమోదు చేశారు.  ఏ1గా సూరిని, ఏ4గా స్వర్ణలతను పేర్కొన్నారు. హోంగార్డు శ్రీను, డ్రైవర్ మెహర్‌లను ఏ2, ఏ3లుగా చూపించారు. ఈ కేసులో స్వర్ణలతను అరెస్ట్ చేసిన వెంటనే వదిలిపెట్టాలంటూ ఒత్తిళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.  

సినిమాలపై వ్యామోహం
సినిమాలపై ఆసక్తి పెంచుకున్న స్వర్ణలత ఇటీవల ఓ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను తీయబోయే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని ఓ ప్రజాప్రతినిధి చెప్పడంతో స్వర్ణలత ఓ కొరియోగ్రాఫర్‌ను కూడా నియమించుకుని ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె హీరోయిన్‌గా ‘ఏపీ 31 నంబర్ మిస్సింగ్’ పేరుతో ఓ సినిమా నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో ఆమెది పోలీసు పాత్రే. ఇటీవల ఈ సినిమా పోస్టర్‌ కూడా విడుదలైంది.

  • Loading...

More Telugu News