Water: కిడ్నీల ఆరోగ్యానికి మంచి నీళ్ల సాయం... అంతా ఇంతా కాదు!

  • జీవరాశి మనుగడకు కీలకంగా ఉన్న మంచినీరు
  • శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలంటున్న నిపుణులు
  • తగినంత నీరు తాగకపోతే యూరిక్ యాసిడ్ పేరుకుపోయే ప్రమాదం
  • కిడ్నీలో రాళ్లు, గౌట్ వంటి సమస్యలకు ప్రధాన కారణం యూరిక్ యాసిడ్
How water helps kidneys well being

భూమిపై జీవానికి ప్రాణాధారం నీరు. మనిషి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర నీటిదే. ముఖ్యంగా కిడ్నీల పనితీరుకు తోడ్పాటు అందిస్తూ మంచి నీరు అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే, నీళ్లు కిడ్నీల ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాయో చూద్దాం! 

మానవ దేహంలోని వ్యర్థాలు మలమూత్రాల రూపంలో విసర్జితమవుతాయని తెలిసిందే. మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ వంటి ఘాటైన పదార్థాలు బయటికి పోతాయి. కొన్నిరకాల పదార్థాలు తిన్నప్పుడు, కూల్ డ్రింక్స్, మద్యం సేవించినప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ అధిక మొత్తంలో పేరుకుపోతుంది. దీన్ని బయటికి పంపించే పని కిడ్నీలదే. 

అయితే నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో పెరిగిపోయిన యూరిక్ యాసిడ్ నిల్వలను కిడ్నీలు పూర్తిగా విసర్జించలేవు. దాంతో కిడ్నీలో రాళ్లు, గౌట్ వంటి కీళ్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి సమస్యలతో వైద్యుల వద్దకు వెళితే, వారు వీలైనంత అధికంగా మంచినీళ్లు తాగమనే చెబుతారు. 

మంచినీళ్లు తాగడం వల్ల రక్తంలోని యూరిక్ యాసిడ్ పల్చబడుతుంది. అప్పుడది కిడ్నీల ద్వారా వడపోతలకు గురై వ్యర్థాలు మూత్రం ద్వారా వెలుపలికి వచ్చేస్తాయి. నీళ్లు సరిగా తాగకపోతే, మూత్రం మరింత గాఢతను సంతరించుకుంటుంది . కిడ్నీలు యూరిక్ యాసిడ్ ను వడపోయడంలో సమర్థవంతంగా పనిచేయలేవు. అలాంటప్పుడు యూరిక్ యాసిడ్ శరీరంలో అధిక మొత్తంలో పోగుపడుతుంది. అది ఘనీభవించి రాళ్లుగా మారుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. 

శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తికావడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒబేసిటీతో బాధపడుతున్న వారిలో యూరిక్ యాసిడ్ స్థాయులు అధికంగా ఉంటాయని తెలిపారు. 

మంచినీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల ఆరోగ్యకరమైన శరీర బరువును కొనసాగించలేరని, ఇలాంటివాళ్లు బరువు పెరగడమో, ఊబకాయులుగా మారడమో జరుగుతుందని, దాంతో యూరిక్ యాసిడ్ తో కలిగే సమస్యల బారినపడుతుంటారని నిపుణులు వివరించారు. లేకపోతే కిడ్నీలపై విపరీతమైన భారం పడుతుందని, క్రమంగా ఇది కిడ్నీల వైఫల్యానికి దారితీస్తుందని వివరించారు. ఇలాంటి సమస్యల బారినపడకూడదనుకుంటే అందుకు నీళ్లే ఔషధం అని స్పష్టం చేశారు.

నీళ్లు కిడ్నీల పనితీరునే కాకుండా, విషపదార్థాల ఏరివేతలో సహాయపడే కాలేయానికి తోడ్పాటునందిస్తాయని తెలిపారు. శరీరంలో హానికర పదార్థాల వడపోతకు సహకరించే ఏ అవయవానికైనా మంచి నీళ్లే మంచి మిత్రుడు అనొచ్చని పేర్కొన్నారు.

More Telugu News