Zimbabwe: వెంటాడిన దురదృష్టం.. స్కాట్లాండ్‌పై ఓడిన జింబాబ్వే.. అనూహ్యంగా ప్రపంచకప్‌కు దూరం

  • ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో దున్నేస్తున్న స్కాట్లాండ్
  • విండీస్, జింబాబ్వే ఆశలను చిదిమేసిన అనామక జట్టు
  • ప్రపంచకప్ ప్రవేశం లాంఛనమే
  • వరుసగా రెండోసారీ ప్రపంచకప్‌కు దూరమైన జింబాబ్వే
 Zimbabwe out From Race ICC ODI World Cup

దురదృష్టమంటే జింబాబ్వేదే. ప్రపంచకప్‌లో చోటు ఖాయమని భావించిన వేళ చివరి మెట్టుపై ఓ అనామక జట్టుపై పరాజయం పాలై అనూహ్యంగా ప్రపంచకప్‌కు దూరమైంది. క్వాలిఫయర్స్‌లో చితక్కొట్టేస్తున్న స్కాట్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్ ఇప్పటికే నిష్క్రమించగా ఇప్పుడు జింబాబ్వే వరుసగా రెండోసారి కూడా దూరమైంది. ఏమాత్రం ఊహించని ఈ పరిణామంతో జింబాబ్వే ఆటగాళ్లు కంటతడి పెట్టుకున్నారు. 

జింబాబ్వేలోని బులవాయోలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌట్ అయింది. తొలుత విజయం దిశగా పయనించిన జట్టు ఆ తర్వాత వరుసపెట్టి వికెట్లు కోల్పోయి అనూహ్యంగా ఓటమి పాలైంది. ర్యాన్ బురి (83), వెస్లీ మద్వీర్ (40) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ చివరి వరుస బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో విజయం దూరమైంది. ఫలితంగా ప్రపంచకప్ ఆశలు నీరుగారిపోయాయి. 

ఇక ఇప్పుడు రేసులో మిగిలింది స్కాట్లాండ్, నెదర్లాండ్స్ మాత్రమే. శ్రీలంక ఇప్పటికే ప్రపంచకప్‌లో బెర్తు కన్పామ్ చేసుకుంది. రేపు స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లు తుది సమరంలో తలపడతాయి. స్కాట్లాండ్ నెగ్గితే ప్రపంచకప్‌లో చోటు ఖాయమవుతుంది. స్కాట్లాండ్ రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో నెదర్లాండ్స్ భారీ విజయం సాధిస్తేనే ప్రపంచకప్‌లో చోటు దక్కుతుంది. లేదంటే నెగ్గినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

More Telugu News