Nara Lokesh: సిల్లీ బచ్చా ఎక్కడికి పారిపోయినా సిట్ వేస్తాం: లోకేశ్

  • నెల్లూరు సిటీలో నారా లోకేశ్ యువగళం
  • వీఆర్ సీ సెంటర్ లో భారీ సభ
  • మాజీ మంత్రి అనిల్ ను లక్ష్యంగా ఏకిపారేసిన లోకేశ్
  • కోటంరెడ్డి, ఆనం, మేకపాటిల ప్రస్తావన తెచ్చిన టీడీపీ యువనేత
  • ఆ ముగ్గురినీ జగన్ అవమానించాడని విమర్శలు
Lokesh Yuvagalam Padayatra in Nellore city gets massive response

టీడీపీ అగ్రనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 146వ రోజు నెల్లూరు నగరంలో జనసంద్రాన్ని తలపించింది. మంగళవారం సాయంత్రం యువగళం పాదయాత్ర నెల్లూరు సిటీ నియోజకవర్గం లోకి ప్రవేశించింది. లోకేశ్ ను చూసేందుకు వచ్చిన జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు నగర ఇన్ ఛార్జి పొంగూరి నారాయణ నేతృత్వంలో వేలాది కార్యకర్తలు యువనేతకు బ్రహ్మరథం పట్టారు. 

వైసీపీ జెండా పీకేసే టైమ్ దగ్గరపడింది

నెల్లూరు వీఆర్ సీ సెంటర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అని కీర్తించారు. శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం, బారా షహీద్ దర్గా ఉన్న పుణ్య భూమి నెల్లూరు అని కొనియాడారు. నెల్లూరు చేపల పులుసు రుచి అద్భుతం అని అన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న నెల్లూరు నేలపై పాదయాత్ర చెయ్యడం తన అదృష్టం అని తెలిపారు. 

"నెల్లూరు నుండి మార్పు మొదలవుతుంది అని నేను జనవరి 27నే చెప్పా... మార్పు మొదలైంది.... వైసీపీ జెండా పీకేసే టైం దగ్గర పడింది. నెల్లూరు జిల్లాలో యువగళం జగన్ కి భయాన్ని పరిచయం చేసింది. జనం... జనం... జనం... ప్రభంజనం, సింహపురిలో సింహ గర్జన అదిరిపోయింది. జగన్ టీవీలో లైవ్ చూస్తున్నాడు. గంజాయి బ్రోకి హాయ్ చెప్పండి. ఈ రోజు తాడేపల్లి ప్యాలస్ లో టీవీలు పగలడం ఖాయం" అని ఎద్దేవా చేశారు. 

గంజాయి క్యాపిటల్ గా మార్చేశారు!

ఈ మధ్య జగన్ ని ఒక పారిశ్రామికవేత్త కలిశారట. జగన్ ఆయన్ని మా రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటు చెయ్యండి అని అడిగాడట. వెంటనే ఆయన, రాజధాని లేని రాష్ట్రంలో కంపెనీ ఎలా పెడతాం సార్. మీ వాళ్ళు పిలిచారని మొహమాటానికి వచ్చాను అన్నాడట.

అప్పుడు జగన్ నేను ఏపీనే దేశానికి రాజధాని చేశాను, నమ్మకపోతే గూగుల్ లో కొట్టండి అని చెప్పాడట. వెంటనే పారిశ్రామికవేత్త ఫోన్ తీసి ఏపీ అని కొట్టాడట. వెంటనే గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని వచ్చిందట. 

చంద్రబాబు గారి హయాంలో జాబ్ క్యాపిటల్ గా ఉన్న ఏపీని జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు. బడిలో గంజాయి, గుడిలో గంజాయి. అందుకే జగన్ పేరు మార్చాను... గంజాయి బ్రో అని ముద్దుగా పేరు పెట్టా. బైబై గంజాయి బ్రో... సేవ్ ఏపీ.

నెల్లూరు సిటీని అభృవృద్ధి చేసింది మేమే!

నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ చెయ్యనంత అభివృద్ధి చేసి నారాయణ ఓడిపోయారు. మీరు ఎక్కువ పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. 

నారాయణ ఒక్క నెల్లూరు సిటీని అభివృద్ధి చెయ్యడానికే రూ.4,500 కోట్లు ఖర్చు చేశారు. ఇది నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్. నెల్లూరు సిటీలో వెయ్యి కోట్లతో మేం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తే... నాలుగేళ్లలో 100 కోట్లు ఖర్చు చేసి పూర్తి చెయ్యలేని వేస్ట్ ప్రభుత్వం వైసీపీది. 

ఒక్క నెల్లూరు టౌన్ లోనే 17 వేల టిడ్కో ఇళ్లు కట్టాం. టీడీపీ అధికారంలోకి వచ్చాక... నారాయణ ఎక్కడ అపేశారో అక్కడ నుండి నెల్లూరు అభివృద్ధి రీస్టార్ట్ చేస్తాం.

అనిల్ అక్రమార్జన విలువ రూ.వెయ్యికోట్లు

పేరులోనే నిల్లు ఉన్న అ 'నిల్లు' చేసింది ఏంటి? డైలాగులు కొట్టడం తప్ప సిటీకి సిల్లీ బచ్చా పీకింది ఏంటి? సిల్లీ బచ్చాకి సబ్జెక్ట్ లో హాఫ్ నాలెడ్జ్... అవినీతిలో ఫుల్ నాలెడ్జ్. 

సిల్లీ బచ్చా సిటీకి తెచ్చిన నిధులు నిల్లు... కానీ నాలుగేళ్లలో పోగేసింది ఏంతో తెలుసా? వెయ్యి కోట్లు. సిల్లీ బచ్చా భూకబ్జాల లిస్ట్ మొత్తం ఈ రోజు నేను బయటపెడుతున్నా. దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేరు మీద 50 ఎకరాలు. విలువ రూ.10 కోట్లు. 

నాయుడుపేటలో 58 ఎకరాలు... ఇవి కూడా బినామీ పేర్లతో ఉన్నాయి. ఈ భూముల విలువ రూ.100 కోట్లు. ఇనుమడుగు సెంటర్ లో బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో 400 అంకణాలు. విలువ రూ.10 కోట్లు. ఇస్కాన్ సిటీలో బినామీల పేర్లతో 87 ఎకరాలు. విలువ రూ.33 కోట్లు.

బినామీల పేరుతో వందల కోట్ల భూములు!

మాజీ మంత్రి అనిల్ బినామీ పేర్లతో వందలకోట్ల ఆస్తులు కొట్టేశాడు. అల్లీపురంలో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 42 ఎకరాలు ఉన్నాయి. విలువ రూ.105 కోట్లు. ఇందులో 7 ఎకరాలు ఇరిగేషన్ భూమి. 

సాదరపాళెంలో డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో మరో 12 ఎకరాలు. విలువ రూ.48 కోట్లు. ఒక పెద్ద కాంట్రాక్టర్ నుండి దశల వారీగా అనిల్ బినామీ చిరంజీవికి కోట్ల రూపాయలు వచ్చాయి. బృందావనంలో శెట్టి సురేష్ అనే బినామీ పేరుతో 4 ఎకరాలు ఉన్నాయి. విలువ 25 కోట్లు. 

దామరమడుగులో బావమరిది పేరుతో 5 ఎకరాలు. విలువ 4 కోట్లు. గూడూరు- చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు లేపేశాడు. 40 ఎకరాల్లో లే అవుట్ వేసి అమ్మేస్తున్నాడు. ఆఖరికి కరోనాని కూడా క్యాష్ చేసుకున్నాడు సిల్లీ బచ్చా. వ్యాపారస్తులను, ఆసుపత్రుల యజమానులు, జ్యువెలరీ షాపుల వారిని బెదిరించి కోట్లు కొట్టేశాడు. 

సిల్లీ బచ్చా అండ్ కంపెనీ పెన్నా నది నుండి ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లు దోచుకుంది. 

ఇలానే వదిలేస్తే సిల్లీ బచ్చా తనని మించిపోతాడని జగన్ కి భయం పట్టుకుంది. అందుకే సీటు చింపేశాడు. క్లారిటీ ఉంది కాబట్టే సిల్లీ బచ్చా చెన్నైలో రూ.50 కోట్లతో ఇల్లు కట్టాడు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే రాష్ట్రం నుండి పరార్! ఎక్కడ ఉన్నా సిల్లీ బచ్చా చేసిన భూ అక్రమాల పై ప్రత్యేక సిట్ వేస్తాం.

ఆ ముగ్గురినీ జగన్ అవమానించారు!

జగన్ కి కష్టం వస్తే మొదట నిలబడిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అలాంటి వ్యక్తిని జగన్ అవమానించాడు. పెద్దాయన ఆనం రాంనారాయణ రెడ్డిని అవమానించాడు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని అవమానించాడు. నెల్లూరు జిల్లా ప్రజల్ని జగన్ అవమానించాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ మాస్ లీడర్లు. 

నెల్లూరు రూరల్ నియోజకవర్గం అన్నా, అక్కడి ప్రజలు అన్నా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాణం పెడతారు. అందరూ ఆయనకు వైసీపీలో అవమానం జరిగింది కాబట్టి బయటకి వచ్చారని అనుకుంటున్నారు. తన రూరల్ నియోజకవర్గానికి అవమానం జరిగింది కాబట్టి ఆయన బయటకి వచ్చారు. రూరల్ నియోజకవర్గం ప్రజల్ని జగన్ అవమానించారు కాబట్టి ఆయన బయటకి వచ్చారు. 

ఆయన ఫోన్ ట్యాప్ చేశారు, వ్యక్తిగత విమర్శలు చేశారు, సెక్యూరిటీ తీసేశారు, ఒక ఉగ్రవాదిని వెంటాడినట్టు ప్రభుత్వం ఆయన్ని వెంటాడుతుంది. అయినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తగ్గలేదు. దమ్మున్న సింహంలా ఎదురు వెళుతున్నారు. కేవలం 10 నెలలు ఓపిక పట్టండి... రూరల్ నియోజకవర్గం రూపురేఖలు టీడీపీ మార్చేస్తుంది.  

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం – 1901.2 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 8.6 కి.మీ.*

*147వ రోజు పాదయాత్ర వివరాలు (5-7-2023):*

*కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)*

మధ్యాహ్నం

2.00 – సాలుచింతల విడిది కేంద్రం వద్ద వ్యాపారులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – సాలుచింతలలో పాదయాత్ర 1900 కి.మీ పూర్తి, శిలాఫలకం ఆవిష్కరణ.

4.15 – స్టోవ్ బీడీ కాలనీలో బీడీ కార్మికులతో సమావేశం

4.35 – పడుగుపాడు మస్జీద్ వద్ద స్థానికులతో మాటామంతీ

4.45 – కోవూరు బజార్ వద్ద స్థానికులతో మాటామంతీ

4.55 – మండబైలు సెంటర్ లో మీ సేవ కార్మికులతో సమావేశం

5.25 – గుమ్మలదిబ్బ ఎస్టీ కాలనీలో ఎస్టీలతో సమావేశం

5.45 – గుమ్మలదిబ్బలో గ్రామస్తులతో సమావేశం

6.30 – పాతూరు వద్ద చేనేతలతో సమావేశం

7.10 – దామరమడుగులో యువతతో సమావేశం

7.45 – ఆర్.ఆర్ నగర్ లో స్థానికులతో సమావేశం

8.20 – కాగులపాడులో గ్రామస్తులతో సమావేశం

8.50 – రేబల జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ

9.00 – చెల్లాయపాలెం విడిదికేంద్రంలో బస.

******

More Telugu News