Dhulipala Narendra Kumar: ఇవాళ చిత్తూరు డెయిరీని ఉద్ధరించానని సీఎం జగన్ చెప్పడం ఓ ఎన్నికల స్టంట్: ధూళిపాళ్ల

  • చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం శంకుస్థాపన
  • హెరిటేజ్ కోసమే చిత్తూరు డెయిరీని మూసేశారని చంద్రబాబుపై ఆరోపణ
  • చిత్తూరు డెయిరీ మూసివేతకు వైఎస్సార్, జగనే కారణమన్న ధూళిపాళ్ల 
Dhulipalla press meet details

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ కొత్త నాటకానికి తెరలేపాడని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ విమర్శించారు. చిత్తూరు జిల్లాలో అమూల్ డెయిరీకి శంకుస్థాపన చేసిన జగన్, చిత్తూరు డెయిరీని ఉద్ధరించినట్టు మాట్లాడటం ఆయనలోని పచ్చి మోసకారీ ఆలోచనలకు నిదర్శనమని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

“రాష్ట్రంలోని సహకార డెయిరీలు, పాడిరైతుల్ని నిలువునా ముంచేలా అమూల్ సంస్థకు మేలు చేసేలా ముఖ్యమంత్రి  నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చిత్తూరు డెయిరీ మూతపడటానికి ముమ్మాటికీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డే కారణం. 

2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిత్తూరు డెయిరీని ఎందుకు తెరిపించలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉండి కూడా చిత్తూరు డెయిరీని ఎందుకు తెరిపించలేదు? చిత్తూరు డెయిరీ తెరిస్తే, తమకు, తమవాళ్లకు చెందిన పాల డెయిరీల మనుగడ దెబ్బతింటుందనే రాజశేఖర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆ పని చేయలేదు. వారి బాటలోనే ఇప్పుడు జగన్ రెడ్డి నడుస్తున్నాడు. 

అమూల్ డెయిరీ ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతోంది తప్ప, దక్షిణాది రాష్ట్రాల్లో దాని కార్యకలాపాలు లేవు. గతంలో తమిళనాడులో ఒక డెయిరీని ప్రారంభించి కూడా మూసేశారు. అలాంటి డెయిరీని జగన్ రెడ్డి రాష్ట్రంలో ప్రోత్సహించడానికి కారణం తనపై ఉన్న అవినీతి కేసులు, కమీషన్ల కోసమే. 

స్వయానా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలోని నందిని డెయిరీని అమూల్ తో కలిసి పనిచేయాలని పిలుపునిస్తే, ఆ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. కర్ణాటక రాష్ట్రంలోని నందిని బ్రాండ్, ఆ రాష్ట్రవాసుల ఆత్మగౌరవానికి ప్రతీక. 

కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులు అమూల్ సంస్థ మాకు వద్దు అంటే ఏపీ ముఖ్యమంత్రి జగన రెడ్డి మాత్రం ఆ సంస్థ కోసం ప్రజల సొమ్ముని అప్పనంగా దోచిపెడుతున్నాడు. హెరిటేజ్ డెయిరీ పాడి రైతుల్ని దోచుకుంటోంది అని అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రికి, చిత్తూరు జిల్లాలో పాడి రైతుల్ని దారుణంగా దోచుకుంటున్న మంత్రి పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ బాగోతాలు కనిపించడంలేదా? 

శ్రీజ డెయిరీ పాల సేకరణ కేంద్రాలను శివశక్తి డెయిరీకోసం ఈ ప్రభుత్వమే మూసే సింది. శివశక్తి డెయిరీ ఒక్కటే ఈరాష్ట్రంలో పాడిరైతులకు లీటర్ కు తక్కువ ధరచెల్లిస్తోంది. అదే శివశక్తి డెయిరీ కార్యకలాపాలు సాగించే ప్రాంతంలో ముఖ్యమంత్రి అమూల్ సంస్థకు ఎందుకు గేట్లు తెరవలేదు? శివశక్తి డెయిరీ మంత్రి పెద్దిరెడ్డి సంస్థ అని దాని జోలికెళ్లలేదా?

అమూల్ సంస్థ రాష్ట్రంలోకి వచ్చాకే ఇతర పాల డెయిరీలు పాడి రైతులకు ఇచ్చే ధరను పెంచాయని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో పాలసేకరణ ధరలు పెరిగాయని ఆయన అవినీతిపత్రికసాక్షిలోనే రాశారు. 

ముఖ్యమంత్రి ఈరోజు హెరిటేజ్ జపమే ఎక్కువచేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన హౌస్ కమిటీలో ఎక్కడైనా సరే హెరిటేజ్ సంస్థ వల్లే రాష్ట్రంలోని సహకార డెయిరీలు దెబ్బతిన్నాయని ఉందా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. హెరిటేజ్ డెయిరీపై, చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై పడి జగన్ రెడ్డి, వైసీపీవాళ్లు ఎన్నాళ్లు ఏడుస్తారు?

రాష్ట్రంలో హెరిటేజ్ తో పాటు సమానంగా వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి తిరుమల డెయిరీ కార్యకలాపాలు సాగిస్తోంది. పెద్దిరెడ్డి శివశక్తి డెయిరీ, దొడ్ల డెయిరీ, జెర్సీ డెయిరీ లాంటివన్నీ బ్రహ్మండంగా మనుగడ సాగిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రికి అవేవీ కనిపించవు.  ప్రజాచైతన్యంతో కూడిన పోరాటం చేస్తున్నందువల్లే జగన్ రెడ్డి మాపై పడి ఏడుస్తున్నాడు” అని ధూళిపాళ్ల నరేంద్రకుమార్ విమర్శించారు.

More Telugu News