Indian Railways: బీహార్‌లో విరిగిన చక్రంతో 10 కిలోమీటర్లు ప్రయాణించిన ఎక్స్‌ప్రెస్ రైలు

  • విరిగిన పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్11 కోచ్‌ చక్రం
  • భారీ శబ్దం రావడంతో గుర్తించిన ప్రయాణికులు
  • చైన్ లాగి, అధికారులకు సమాచారం ఇవ్వడంతో మరమ్మతు
Pawan express runs for 10 km with broken wheel in Bihar

విరిగిన చక్రంతోనే ఓ ఎక్స్‌ప్రెస్ రైలు 10 కిలోమీటర్లు ప్రయాణించిన సంఘటన బీహార్ లో జరిగింది. ఈ భయానక ఘటన ముజఫర్‌పూర్-హాజీపూర్ రైల్ సెక్షన్ భగవాన్‌పూర్ స్టేషన్ వద్ద ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది.

ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం... పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ లోని ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి ముంబైకి బయలుదేరింది. కాసేపటికి ఎస్-11 కోచ్‌లో పెద్ద శబ్దాలు వినిపించాయి. రైలులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భగవాన్‌పూర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న తర్వాత ప్రయాణికులు అప్రమత్తం కావడంతో సమస్యను గుర్తించే ప్రయత్నం చేశారు.

పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు భగవాన్‌పుర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరగా.. ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపేశారు. ఆ తర్వాత కొంతమంది ప్రయాణికులు రైలు డ్రైవర్, గార్డులకు సమాచారం అందించారు. రైల్వే అధికారులు తనిఖీ చేయగా ఎస్-11 కోచ్ చక్రం విరిగిపోయినట్లుగా గుర్తించారు. రైల్వే ఇంజినీర్లు, ఉద్యోగులు రైల్వే స్టేషన్ కు చేరుకొని చక్రానికి మరమ్మతులు చేపట్టారు. 'పవన్ ఎక్స్‌ప్రెస్‌లో చక్రం విరిగిందని మాకు సమాచారం అందింది. మా బృందం అక్కడికి చేరుకుని లోపాన్ని సరిదిద్దింది' అని తూర్పు మధ్య రైల్వే హాజీపూర్ సీపీఆర్వో వీరేంద్ర కుమార్ తెలిపారు.

More Telugu News