Ajit Pawar: అజిత్‌ పవార్ సహా 9 మందిపై ఎన్సీపీ అనర్హత పిటిషన్

  • ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్
  • మంత్రులుగా మరో 8 మంది
  • వారిని ద్రోహులుగా పిలవలేమన్న పార్టీ చీఫ్ జయంత్ పాటిల్
Sharad Pawars Partys Big Move After Ajit Switch

ఎన్సీపీలో పెను కలకలానికి కారణమైన ఆ పార్టీ నేత అజిత్ పవార్ సహా 9 మంది రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలకు ఎన్సీపీ సిద్ధమైంది. వారిపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినట్టు పార్టీ అధినేత జయంత్ పాటిల్ తెలిపారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్న కుమారుడైన అజిత్ పవార్ నిన్న ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో 8 మంది కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు ఈమెయిల్ ద్వారా పిటిషన్ పంపామని, స్వయంగా కలిసి కూడా అందజేస్తామని జయంత్ పాటిల్ తెలిపారు. వీలైనంత త్వరగా దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా స్పీకర్‌ను కోరినట్టు పేర్కొన్నారు. 

ఎలక్షన్ కమిషన్‌ను కలిసి అన్ని జిల్లాల కార్యకర్తలు శరద్ పవార్‌తోనే ఉన్నారని స్పష్టం చేసినట్టు తెలిపారు. 9 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ కాబోరని జయంత్ పాటిల్ స్పష్టం చేశారు. వారి ప్రమాణ స్వీకారం పార్టీ నిబంధనలకు విరుద్ధమని అన్నారు. తమ అధినేత అంగీకారం లేకుండానే వారు ప్రమాణ స్వీకారం చేసినట్టు చెప్పారు. ఆ తొమ్మిదిమంది సాంకేతికంగా పార్టీ నుంచి అనర్హతకు గురైనట్టేనని వివరించారు. అయితే, వారిని ద్రోహులుగా పిలవలేమని, వారి ద్రోహం ఇంకా రుజువు కాలేదని జయంత్ పాటిల్ తెలిపారు. వారిలో చాలామంది తమతో టచ్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు.

More Telugu News