Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ జనగర్జన సభకు ప్రభుత్వమే అడ్డంకులు సృష్టించడం సరికాదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • నేడు ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ
  • హాజరవుతున్న రాహుల్ గాంధీ
  • డబ్బులు కడతామన్నా ఆర్టీసీ బస్సులు ఇవ్వడంలేదన్న కోమటిరెడ్డి
  • ఇతర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారని ఆరోపణ
  • ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టీకరణ
Komatireddy Venkat Reddy fires on BRS govt

నేడు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సభకు వస్తున్నారు. అయితే ఖమ్మం సభకు బీఆర్ఎస్ అనేక అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. 

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనిపై స్పందిస్తూ, కాంగ్రెస్ జనగర్జన సభకు ప్రభుత్వమే అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదని అన్నారు. రాహుల్ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడం ఏంటి? కేసీఆర్ కు చెప్పేదొక్కటే... ప్రజాస్వామ్యంలో విపక్షాలకు సభలు, పోరాటాలు, ధర్నాలు నిర్వహించుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.

డబ్బులు కడతామన్నా ఆర్టీసీ బస్సులను ఇవ్వలేదని, జనం ప్రైవేటు వాహనాల్లో సభకు వెళుతున్నా అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. 

"ఎక్కడ మీటింగులు జరిగినా ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకోవడం సాధారణంగా జరిగే విషయమే. కానీ కాంగ్రెస్ జనగర్జన సభకు భయపడిన రాష్ట్ర ప్రభుత్వం బస్సులను ఇవ్వడంలేదు. ఇతర వాహనాలను కూడా ఆపేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇలా కక్ష గట్టి మరీ జనాన్ని కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 

35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే సభను సజావుగా నడిపేందుకు పోలీసులకు తగిన సూచనలు చేయాలి... లేకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది" అని కోమటిరెడ్డి హెచ్చరించారు. 

తాము ప్రజల పక్షాన పోరాడేందుకు సభలు పెట్టుకుంటుంటే ఇలా నిర్బంధం తరహా చర్యలు సరికాదని హితవు పలికారు. ఆఖరికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత నిరంకుశత్వాన్ని చూడలేదని అన్నారు. సొంత రాష్ట్రంలో ఈ నిర్బంధం ఏమిటి? అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహంతో ప్రశ్నించారు. 

సీఎం ఆదేశాల మేరకు పోలీసులు ఇలా చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తోందని, ఏదైనా జరగరానిది జరిగితే తమకేం సంబంధం లేదని స్పష్టం చేశారు. గత తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ శ్రేణులను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, అయినప్పటికీ తాము న్యాయపరంగా పోరాడుతున్నామే తప్ప హద్దు మీరలేదని చెప్పారు. 

ఇప్పుడు లక్ష మంది సభకు వస్తుండడం చూసి ఓర్వలేక ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. ముందే హెచ్చరిస్తున్నాం... ఏం జరిగినా మాకేం సంబంధం లేదు... తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోంది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్ఘాటించారు.

More Telugu News