Team India: తిరుగులేని కబడ్డీ కూత.. ఎనిమిదోసారి ఆసియా చాంపియన్ గా భారత్

  • ఫైనల్లో 42-32తో ఇరాన్ ను చిత్తు చేసిన భారత జట్టు
  • సత్తా చాటిన కెప్టెన్ పవన్ సెహ్రావత్ 
  • తొమ్మిది పర్యాయాల్లో ఎనిమిదిసార్లు టైటిల్ నెగ్గిన టీమిండియా
India win Asian Kabaddi Championship Title for 8th time

కబడ్డీ ఆటలో తమకు తిరుగులేదని భారత పురుషుల జట్టు మరోసారి నిరూపించింది. ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ లో భారత్ విజేతగా నిలిచింది. తొమ్మిది ఎడిషన్లలో మన జట్టు ఎనిమిదోసారి ట్రోఫీ నెగ్గింది. కొరియాలోని బుసాన్ లో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్  42-32తో ఇరాన్‌ను చిత్తుగా  ఓడించింది. భారత కెప్టెన్ పవన్ సెహ్రావత్ సూపర్- 10తో సత్తా చాటాడు. అంతకుముందు జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 64-20తో హాంకాంగ్‌ను ఓడించింది. దాంతో టోర్నీ లీగ్ దశను అజేయంగా ముగించింది. ఈ మెగా టోర్నీలో భారత్, ఇరాన్, జపాన్, కొరియా, చైనీస్ తైపీ, హాంకాంగ్ జట్లు పోటీ పడ్డాయి. 

లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇరాన్ రెండో స్థానంలో నిలిచి భారత్ తో ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న భారత్  సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. 2018 ఆసియా క్రీడల్లో భారత్ సెమీఫైనల్లోనే ఓడింది. ఈసారి స్వర్ణం నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంది.

More Telugu News