Mahabubabad District: బ్యాంక్‌లో చోరీకి యత్నించిన 13 ఏళ్ల బాలుడు.. చివరకు ఏం జరిగిందంటే..!

  • మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ‌లో చోరీకి యత్నం
  • బ్యాంకు వెనుకవైపు గ్రిల్స్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన బాలుడు
  • టేబుళ్లు, సొరుగుల్లో డబ్బుల కోసం వెతుకులాట, ఏమీ దొరక్క వెనుదిరిగిన వైనం
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలుడి ఆచూకీ కనుక్కున్న పోలీసులు
  • పాత నేరస్థుడితో పరిచయం, ప్రోద్బలంతోనే చోరీకి యత్నించానన్న బాలుడు
13 year old boy from mahabubabad district attempts robbery in local sbi branch

ఆ చిన్నారి వయసు జస్ట్ 13 ఏళ్లు. చదివేది 7వ తరగతి. కానీ అతడు ఏకంగా బ్యాంకులో చోరీకి ప్రయత్నించాడు. గేటు తాళాలు పగలగొట్టి లోపలికెళ్లాడు. డబ్బుల కోసం లోపలున్న టేబుళ్లు, సొరుగులు వెతికాడు. ఏమీ కనిపించకపోవడంతో ఇంటికెళ్లిపోయాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో వెలుగు చూసిందీ ఘటన. బాలుడు చోరికి పాల్పడుతున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. 

దోపిడీకి ప్రయత్నించిన బాలుడిది ఇర్సులాపురం. బయ్యారం-పందిపంపుల రహదారి పక్కన ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లో అతడు చోరికి యత్నించాడు. గడ్డపారతో బ్యాంకుకు వెళ్లిన అతడు వెనుకవైపు గ్రిల్స్‌‌తో ఉన్న తలుపు తాళం పగలగొట్టి లోపలకు ప్రవేశించాడు. డబ్బులేమీ దొరక్కపోవడంతో వెనుదిరిగాడు. మరునాడు ఉదయం బ్యాంకుకు వచ్చిన స్వీపర్ తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి అధికారులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలించారు. అయితే, పటిష్ఠ భద్రత ఉండే బ్యాంకులో ఓ 13 ఏళ్ల బాలుడు తనంతటతాను చోరీకి ప్రయత్నించడం సాధ్యమేనా? అన్న సందేహాం వ్యక్తమవుతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు బాలుడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 

పాత నేరస్థుడి ప్రోద్బలంతోనే తాను చోరీకి యత్నించినట్టు బాలుడు పోలీసులకు తెలిపినట్టు సమాచారం. దొంగతనాల్లో అనుభవం ఉన్న ఓ పాత నేరస్థుడితో బాలుడికి పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఆ తరువాత అతడు బాలుడిని చోరీకి దిగమని బెదిరించాడని సమాచారం. వెనుకవైపు గోడ మీద నుంచి తనను అతడు పైకిఎక్కించి ఆ తరువాత తాను బయటకు వచ్చే వరకూ అక్కడే ఉన్నాడని బాలుడు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఆ తరువాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారని చెప్పాడట.  

More Telugu News