Telangana: తెలంగాణ సమాజం గొప్ప గాయకుడిని, కళాకారుడిని కోల్పోయింది: సీఎం కేసీఆర్

CM KCR Pays Tribute To Singer Sai chand
  • సాయిచంద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
  • ఆయన లేకుండా తన సభలు ఉండేవి కావన్న సీఎం
  • సాయిచంద్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకుడ్ని, కళాకారుడ్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న వ్యక్తి సాయిచంద్ అన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సీఎం తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను, చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం స్మరించుకున్నారు. సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్ఫూర్తిని నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని సీఎం అన్నారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని ప్రకటించారు.
Telangana
CM KCR
saichand
singer

More Telugu News