Laser Internet: భారత్ లో లేజర్ ఇంటర్నెట్... చేయి కలిపిన గూగుల్, ఎయిర్ టెల్

  • వైర్లు అక్కర్లేకుండానే ఇంటర్నెట్
  • కేవలం కాంతి కిరణాలను ఉపయోగించుకుని డేటా ప్రసారం
  • కాలిఫోర్నియాలోని ల్యాబ్ లో వినూత్న టెక్నాలజీ ఆవిష్కరణ
  • కాంగో నది వద్ద ప్రయోగాత్మకంగా పరిశీలన
  • భారత్ లో మారుమూల ప్రదేశాలకు ఇంటర్నెట్ అందించే వెసులుబాటు
Google and Airtel join hands for Laser based Internet in India

కాంతి కిరణాల సాయంతో ఇంటర్నెట్ డేటాను ప్రసారం చేసే సరికొత్త లేజర్ టెక్నాలజీ కాలిఫోర్నియాలోని ఇన్నోవేషన్ ల్యాబ్ లో ఆవిష్కరించారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఈ లేజర్ ఆధారిత ఇంటర్నెట్ సాంకేతికతను అభివృద్ధి చేసింది. 

ఈ టెక్నాలజీ పేరు ఎక్స్. భారత్ లోనూ ఈ లేజర్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనున్నారు. అందుకోసం ఆల్ఫాబెట్ తో దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ చేతులు కలిపింది. లేజర్ ఆధారిత టెక్నాలజీ సాయంతో దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సౌకర్యం అందించనున్నారు.

ఈ టెక్నాలజీని ఆఫ్రికా ఖండంలోని కాంగో నది పరిసరాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ నది విశాలమైనది. ఈ నదికి ఒకవైపున కిన్షాసా, మరో వైపున బ్రాజవిల్ నగరం ఉన్నాయి. ఈ రెండు సిటీల మధ్య ఇంటర్నెట్ కేబుల్స్ వేయాలంటే 400 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. 

ఈ నేపథ్యంలో, లేజర్ టెక్నాలజీని ఇక్కడ పరీక్షించి చూశారు. నదికి రెండు వైపులా లేజర్ టవర్ లు ఏర్పాటు చేసి, వాటి నుంచి వెలువడే కిరణాల సాయంతో ఇంటర్నెట్ డేటాను ప్రసారం చేశారు. 20 రోజుల పాటు గరిష్ఠంగా 20 జీబీపీఎస్ స్పీడ్ తో 700 టెరాబైట్ల డేటా ప్రసారం చేశారు. అయితే, పక్షులు, మంచు వంటి కొన్ని అడ్డంకుల వల్ల ఇంటర్నెట్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడినట్టు గుర్తించారు. 

ఈ లేజర్ ఇంటర్నెట్ భారత్ లోని మారుమూల ప్రదేశాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆల్ఫాబెట్, ఎయిర్ టెల్ భావిస్తున్నాయి.

More Telugu News