Nifty: తెగ కొనేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు.. రికార్డు స్థాయికి నిఫ్టీ

  • నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరిక
  • ఏప్రిల్ నుంచి రూ.82వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు
  • రెండేళ్ల స్థిరీకరణ తర్వాత సానుకూలత
Nifty at record high FII buying crosses 10 billion mark in FY24

విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఈక్విటీ మార్కెట్ కొత్త శిఖరాలకు చేరుకుంది. గత ఏడాదిన్నర కాలం పాటు స్థిరీకరణ తర్వాత గత రెండు నెలలుగా ఈక్విటీలు ర్యాలీ చేస్తుండడం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు 10 బిలియన్ డాలర్ల (రూ.82,000 కోట్లు) మేర భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. దీంతో నిఫ్టీ 18,900 రికార్డు స్థాయిని తొలిసారిగా అధిగమించింది. 


విదేశీ ఇన్వెస్టర్లు గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో నికరంగా భారత మార్కెట్లో అమ్మకాలు చేయడం గమనార్హం. ఈ ఏడాది మార్చి నుంచి విదేశీ ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పు వచ్చింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం, ఇందుకు ఒక కారణం. విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ లో 1.4 బిలియన్ డాలర్లు, మే నెలలో 5.3 బిలియన్ డాలర్లు, జూన్ నెలలో 3.7 బలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వర్ధమాన మార్కెట్లలో అధిక పెట్టుబడులను ఆకర్షించిన ఏకైక మార్కెట్ మనదే కావడం గమనార్హం. దీనికితోడు దేశీయ మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. 

చమురు ధరలు స్థిరంగా ఉండడం, కమోడిటీల ధరలు తగ్గుముఖం పట్టడం, వడ్డీ రేట్ల పెంపు సైకిల్ చివరికి రావడం ఇవన్నీ అనుకూలమైన అంశాలని బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 18,964 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది రికార్డు స్థాయి. అటు సెన్సెక్స్ సైతం 63,884 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది కూడా ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి. సమీప కాలంలో పెద్ద కరెక్షన్లకు అవకాశం లేదన్నది నిపుణుల అభిప్రాయం.

More Telugu News