Rahul Gandhi: కేసీఆర్‌తో దోస్తీపై తేల్చేసిన రాహుల్ గాంధీ.. జాతీయ కూటమిలోను నో ఛాన్స్

  • కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని రాహుల్ గాంధీ, ఖర్గే వెల్లడి
  • కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలని సూచన
  • బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉంటాయని చెప్పిన అగ్రనేతలు
Rahul Gandhi clarifies on alliance with BRS

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపై తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి చెప్పారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. స్ట్రాటెజీ కమిటీ సమావేశం అనంతరం వీహెచ్, మధుయాష్కీ గౌడ్, మల్లు భట్టి విక్రమార్క తదితరులు మాట్లాడారు.

బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ తేల్చి చెప్పినట్లు వెల్లడించారు. వచ్చే ఐదు రోజుల్లో పదవులు అన్నీ భర్తీ చేస్తామని చెప్పారని, ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, నాయకులు అందరూ ఏకతాటిపై నడవాలని సూచించారని చెప్పారు. కేసీఆర్ తీసుకువచ్చిన ధరణిపై కమిటీ వేయాలని రాహుల్ నిర్ణించారు. 

కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని రాహుల్ గాంధీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా నేతలకు స్పష్టం చేశారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను పొత్తుకు అవకాశం లేదని, జాతీయ కూటమిలోను బీఆర్ఎస్ కు చోటులేదని ఖర్గే ఈ సమావేశంలో చెప్పారని అంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పారు.

బీజేపీ దుష్ప్రచారం

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. పొత్తు ఉండదని ఖర్గే చెప్పారని వీహెచ్ అన్నారు.

కర్ణాటకలో వచ్చిన ఫలితాలే

కర్ణాటకలో వచ్చిన ఫలితాలే తెలంగాణలో వస్తాయని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని, ఇల్లులేని వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12,500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరఫున బీమా అందిస్తామన్నారు. ధరణి పోర్టల్ పై పోరాటం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు, క్వార్టర్ ఖాళీ చేయించడం అంతా దురుద్దేశ్యంతో జరిగిందన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనతో బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడిందన్నారు.

More Telugu News