Manipur: మణిపూర్ లో ‘నో వర్క్ నో పే’.. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం ఆదేశాలు

No work No pay in Manipur says chief minister biren singh
  • అల్లర్లు మొదలైనప్పటి నుంచి ఉద్యోగుల గైర్హాజరు
  • విధులకు హాజరు కాని వారి గురించి సీఎం ఆరా
  • డ్యూటీ చేసిన వారికే నెలాఖరున జీతం ఇస్తామని ప్రకటన
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరుకావడంలేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరు దాడి చేస్తారోననే భయంతో చాలామంది ఇంటికే పరిమితం అవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. అందులో చాలామంది గైర్హాజరు అవుతున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ దృష్టి సారించారు. అల్లర్లను నియంత్రించే పని పోలీసులు, భద్రతా బలగాలు చూసుకుంటాయని, ఉద్యోగులు మాత్రం యథావిధిగా తమ విధులకు హాజరుకావాలని చెప్పారు. గైర్హాజరవుతున్న ఉద్యోగులకు జీతంలో కోతలు తప్పవని, రాష్ట్రంలో ‘నో వర్క్ నో పే’ రూల్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. అల్లర్లు మొదలైనప్పటి నుంచి విధులకు హాజరు కాని వారి వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలని అన్ని శాఖల అధిపతులకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర జనాభాలో సుమారు 53 శాతం ఉన్న మైతీలను ప్రభుత్వం షెడ్యూల్ ట్రైబ్ (ఎస్టీ) జాబితాలో చేర్చడంతో మొదలైన అల్లర్లు రోజులు గడుస్తున్నా ఆగడంలేదు. మైతీలు, కుకీలు పరస్పర దాడులతో రాష్ట్రం రావణకాష్ఠంలా రగులుతోంది. ఇప్పటి వరకు దాదాపు వందమందికి పైగా జనం చనిపోయారు. ఆస్తి నష్టం లెక్కలు ఇప్పట్లో తేలేలా లేవని అధికారులు చెబుతున్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు మణిపూర్ లో మోహరించిన భద్రతాబలగాలు అల్లరి మూకలపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. అల్లర్లను నియంత్రించేందుకు మణిపూర్ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఆర్మీ ట్వీట్ చేసింది.
Manipur
no work no pay
cm biren singh
unrest

More Telugu News